- వారి హయాంలో కట్టిందే కూలింది
- విచారణ చేస్తున్నం.. త్వరలో దోషులను తేలుస్తం
- కాళేశ్వరమే కాదు.. గత పాలకులు కట్టినవన్నీ నాసిరకమే
- గోదావరినే కాదు కృష్ణానదిని కూడా వాళ్లు వదిలిపెట్టలే
- త్వరలో విద్యుత్ శాఖలో పదోన్నతులు, బదిలీలు
- విద్యుత్ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష
హైదరాబాద్, వెలుగు: సుంకిశాల వాల్ కూలడం గత బీఆర్ఎస్ సర్కారు పాపమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇన్నాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల మాత్రమే నాసిరకం అనుకున్నాం కానీ.. సుంకిశాల గోడ కూలడంతో గత పాలకులు కట్టినవన్నీ నాసిరకమేనని తేలిందని అన్నారు.
గోదావరినే కాదు కృష్ణానదిని కూడా బీఆర్ఎస్ వదిలిపెట్టలేదని స్పష్టమైనట్టు చెప్పారు.
గురువారం మింట్ కాంపౌండ్‌లోని సదరన్ డిస్కం కార్పొరేట్ఆఫీసులో సీజన్లో చేపట్టాల్సిన కార్యాచరణపై ఎనర్జీ సెక్రటరీ, సదరన్ డిస్కం సీఎండీ, డైరెక్టర్లు, ఎస్ఈ, ఏడీ స్థాయి విద్యుత్ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో డిజైన్ల లోపంతో నిర్మించిన సుంకిశాల గోడలు కూలిపోతే.. బీఆర్ఎస్పార్టీవాళ్లు ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చెబుతున్నారని మండిపడ్డారు.
ఆ పార్టీ పత్రిక, టీవీ చానల్లో సుంకిశాల పాపం వేరొకరిదన్నట్టు భ్రమింపజేసి.. కాంగ్రెస్ రాగానే కూలిందన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నగరానికి మంచినీటికోసం కృష్ణా డెడ్ స్టోరేజీ నీటిని తరలించేందుకు కడుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రమాదం జరిగినట్టు అర్థం వచ్చేలా కథనాలు ఉన్నాయని తెలిపారు. సుంకిశాల ప్రాజెక్టు తాము కట్టింది, కట్టించింది కాదని.. తమ హయాంలో నిర్మించింది అసలేకాదని వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజల సొమ్మును ఏరకంగా నష్టపోయేలా చేశారో సుంకిశాలతో తేలిపోయిందని అన్నారు.
దోషులెవరో తేలుస్తం
నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో సుంకిశాల ప్రాజెక్టుకు 2021 జూన్ 11న గత బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసి, 2021 జులైలో పనులు ప్రారంభించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2023 జులై వరకు రిజర్వాయర్ టన్నెల్ సైడ్ వాల్ పూర్తి చేశారని వివరించారు. గత సర్కారు హయాంలో కట్టించిన వాల్మాత్రమే ఇప్పుడు కూలిందని చెప్పారు.
గత బీఆర్ఎస్సర్కారు పాలన, డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో ఈ ఘటనతో అర్థమైందన్నారు. బీఆర్ఎస్ నేతలు అక్రమంగా సంపాదించిన పైసలు ఖర్చుపెడుతూ సోషల్ మీడియాలో ఎవరిదో ఈ పాపం అన్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ప్రజలు ఇప్పటికే గట్టిగా బుద్ధి చెప్పారని, మరోసారి లేవకుండా చేస్తారని భట్టి విక్రమార్క విమర్శించారు. సుంకిశాల సైడ్ వాల్ కూలిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారని, దోషులు ఎవరో తేలుస్తామని అన్నారు.
క్వాలిటీ పవర్ ఇస్తేనే పెట్టుబడులు
క్వాలిటీ పవర్ ఇస్తేనే హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు వస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నగరం దేశానికే తలమానికమని, గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా, బయోటెక్, ఇతర సర్వీస్ సెక్టార్లలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు.
సీఎం, మంత్రులు పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లగా.. కంపెనీలు క్వాలిటీ పవర్, లా అండ్ ఆర్డర్, మంచినీటి వసతి అడుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ కు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్న నమ్మకం కలిగించేలా క్వాలిటీ పవర్ అందించేం దుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించా రు. వర్షాకాలం నేపథ్యంలో ఈదురుగాలులు, వానలతో కరెంటు పోల్స్ వంగి, చెట్లు కరెంటు తీగలపై పడి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని, సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.
విద్యుత్ కస్టమర్ హెల్ప్‌లైన్ 1912 నంబర్ కు విస్తృత ప్రచారం కల్పించనున్నట్టు తెలిపారు. 108 తరహాలో హెల్ప్ లైన్ సేవలను విస్తృతం చేస్తామ ని చెప్పారు. ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ సంస్థలో పని చేసే చాలా మంది ఉద్యోగులకు ప్రమోషన్లు లేవని తన దృష్టికి తీసుకువచ్చారనీ, తగు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్టు భట్టి వివరిం చారు.
మారిన కాలానికి తగ్గట్టుగా విద్యుత్ సిబ్బంది సేవలు పెరగాలని అన్నారు. సిబ్బంది బాగా పనిచేసి ప్రచారానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించు కోవాలని సూచిం చారు. తమకు బేషజాలు లేవని, ఎంత చిన్నవా రు సమస్యలు చెప్పిన వినడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేసే క్రమంలో స్థలం సమస్య వస్తున్నదని, ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చే సమయంలోనే విద్యుత్ శాఖకు అవసరమైన స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు లెటర్ రాస్తానని డిప్యూటీ సీఎం వివరించారు.
