V6 News

జీహెచ్ఎంసీ అప్పును మీరే కట్టండి..సర్కారుకు సూచిస్తూ కమిటీ రిపోర్ట్

జీహెచ్ఎంసీ అప్పును మీరే కట్టండి..సర్కారుకు సూచిస్తూ కమిటీ రిపోర్ట్
  •     రెడీ అయిన రాష్ట్ర ప్రభుత్వం  
  •     తను కట్టాల్సిన ఆస్తి పన్ను రూ.5834 కోట్ల చెల్లింపునకు సిద్ధం 
  •     సీఎంసీ,ఎంఎంసీ లకు చెరో రూ.500 కోట్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడమే సరైన పద్ధతి అని కమిటీ సూచించింది. జీహెచ్ఎంసీకి ఉన్న రూ.4,770 కోట్ల అప్పులకి సంబంధించి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్ట్​తయారు చేసి సర్కార్ కు అందజేసింది. అందులో ప్రభుత్వమే ఆ అప్పు చెల్లించడం వల్ల మూడు కార్పొరేషన్లకు ఇబ్బందులు ఉండవని, అభివృద్ధికి కూడా ఆటంకాలు కలగవని పేర్కొంది. 

ఈ సూచనను పరిశీలించిన ప్రభుత్వం కూడా అప్పు చెల్లించేందుకు రెడీ అయినట్టు సమాచారం. అయితే, రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు సంబంధించి జీహెచ్ఎంసీకి రూ.5834 కోట్లు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ బకాయిలనే అప్పుల రూపంలో చెల్లించేందుకు సర్కారు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. 

బీఆర్ ఎస్ హాయంలోనే  అప్పులు...

బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో 9 ఏండ్ల పాటు జీహెచ్ఎంసీ అప్పులు చేసింది. ఏ పనికీ అప్పటి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. మొత్తంగా ఎస్​బీఐ నుంచి రూ.6,530 కోట్లను అప్పుగా తీసుకుంది. ఇందులో ఎస్ఆర్​డీపీ కోసం రూ.4,250 కోట్లు , సీఆర్​ఎంపీ కోసం 7.20 శాతం వడ్డీతో రూ.1460 కోట్లు, ఎస్ఎన్డీపీ కోసం రూ.680 కోట్లను 7.20 శాతం వడ్డీతో తీసుకుంది. జేఎన్ఎన్​యూఆర్ఎం ఇండ్లకోసం రూ.140 కోట్ల హడ్కో లోన్ తీసుకుంది. ఇందులో రూ.100 కోట్లను 8.90 శాతం వడ్డీతో, మరో రూ.40 కోట్లను 9.90 శాతం వడ్డీతో తీసుకుంది. బీఆర్ఎస్​హయాంలో జీహెచ్ఎంసీకి ఎలాంటి నిధులు ఇవ్వలేదు. దీంతో అప్పుల్లో కూరుకుపోయింది. కాంగ్రెస్​సర్కారు వచ్చిన తర్వాత ప్రతి నెల నెలకు రూ. 100 కోట్ల చొప్పున తిరిగి చెల్లిస్తూ వస్తున్నది.

ఇలా ఇప్పటికే రూ.1900 కోట్లకిపైగా అప్పును తీర్చింది. మిగిలిన రూ. 4770 కోట్లను జీహెచ్​ఎంసీ తిరిగి చెల్లించాల్సి ఉన్నది. మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన తర్వాత ఈ అప్పును తీర్చేందుకు ఏం చేయాలని కాంగ్రెస్​సర్కారు ఒక కమిటీ వేయగా, వారు ప్రభుత్వమే తీర్చాలని సూచించారు. దీనిపై ఆలోచన చేసిన ప్రభుత్వం తాను జీహెచ్​ఎంసీకి బకాయి ఉన్న ఆస్తి పన్నును పూర్తిగా చెల్లించి బల్దియా అప్పును తీర్చే ప్రయత్నం చేయబోతున్నది.  

మూడు కార్పొరేషన్లకు రిలాక్స్

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో  మూడు కార్పొరేషన్లు రిలాక్స్ కానున్నాయి. అప్పుల భారం పోతే కార్పొరేషన్ సొంత ఆదాయాన్ని కేవలం ప్రజల అవసరాల కోసమే ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే  సీఎంసీ, ఎంఎంసీలకు  రూ.500 కోట్ల చొప్పున జీహెచ్ఎంసీ ఇస్తామని ప్రకటించిన రూ.1000 కోట్లను కూడా ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిధులతో నగరంలోని వివిధ జోన్లలో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల రిపేర్లు, పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు.