కొనసాగుతున్న హైకోర్టు న్యాయవాదుల ఆందోళన

కొనసాగుతున్న హైకోర్టు న్యాయవాదుల ఆందోళన

హైకోర్టు న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిని పాట్నా హై కోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసనగా.. అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయానికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తన నిరసనలు కొనసాగిస్తామని లాయర్లు తేల్చి చెప్పారు. అటు సిటీ సివిల్ కోర్టులోనూ లాయర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 

న్యాయమూర్తుల బదిలీకి మార్గదర్శకాలను రూపొందించాలని టిహెచ్ సిఎఎ అధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్ చేశారు. పిక్ అండ్ సెలెక్ట్ పద్ధతి న్యాయమూర్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆకస్మిక బదిలీలను ఆపకపోతే న్యాయమూర్తులు నిర్భయంగా, స్వతంత్రంగా పని చేయలేరని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయంపై చాలా మంది హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. దీనిపై ఈనెల 21న సుప్రీంకోర్టును ఆశ్రయించి.. న్యాయమూర్తులు, న్యాయవాదుల సమస్యలను వివరిస్తామని ప్రకటించారు.