ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని లక్ష కంప్లయింట్స్

ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని లక్ష కంప్లయింట్స్

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ కన్జ్యూమర్​ ఫోరమ్​కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫోరం ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్1967, ప్రత్యేక వాట్సప్ నంబర్ 7330774444కు లక్షకు పైగా కంప్లయింట్స్​ అందాయి. లాక్ డౌన్ సమయంలో ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారని, తూకం తక్కువగా ఉందని, నాణ్యమైన సరుకులు ఇవ్వడం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయి. మార్చి 22 నుంచి శనివారం నాటికి 47 రోజుల్లో కన్జ్యూమర్​ ఫోరానికి వచ్చిన ఫిర్యాదుల సంఖ్య దాదాపు లక్ష ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లోని సూపర్ మార్కెట్లపై ఎక్కువ కంప్లయింట్స్​ వచ్చాయి. సాధారణ రోజుల్లో సగటున 300 కంప్లయింట్స్​ ఉంటే.. లాక్​డౌన్​ టైంలో 2 వేల ఫిర్యాదులు వస్తున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. లాక్ డౌన్ ను దృష్టిలో పెట్టుకుని కంప్లయింట్స్ తీసుకునేందుకు ఫోరమ్​ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫోన్, వాట్సప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే ఎన్ ఫోర్స్ మెంట్, తూనికలు కొలతల శాఖ అధికారులకు పంపుతున్నారు.

రూ.1,500 సంగతేంటి

లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు నెలకు రూ.1,500 బ్యాంకుల్లో వేసింది. తమకు డబ్బులు రాలేదని టోల్ ఫ్రీ నంబర్ 180042500333కు వేల సంఖ్యల్లో ఫిర్యాదులు వచ్చాయి. మూడు నెలలుగా రేషన్ తీసుకోని దాదాపు 7 లక్షల మందికి డబ్బులు వేయొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు తెలిపారు