
టాలీవుడ్లో సినిమా షూటింగ్స్ బంద్పై నెలకొన్న వివాదం కొత్త మలుపు తిరిగింది. సినీ కార్మికుల వేతనాల పెంపుపై టాలీవుడ్ నిర్మాతలు నిర్ణయాన్ని ప్రకటించారు. వేతనాల పెంపునకు అంగీకరిస్తూనే పలు ఆంక్షలను విధిస్తూ నిర్మాతలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. రోజుకు 2 వేల రూపాయల కంటే తక్కువ ఉన్నవారికే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ముందుకొచ్చారు.
తొలి ఏడాది 15, రెండో ఏడాది 5, మూడో ఏడాది 5 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. రోజుకు వెయ్యి రూపాయల వేతనం ఉన్నవారికి తొలి ఏడాది 20 శాతం 20 శాతం పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు. మూడో ఏడాది 5 శాతం పెంచేందుకు నిర్మాతలు సుముఖత వ్యక్తం చేశారు. 2 వేల రూపాయలకు పైగా ఉన్న కార్మికులకు వేతనాలు పెంచలేమని నిర్మాతలు తేల్చి చెప్పారు. చిన్న సినిమాలకు పాత విధానంలో వేతనాలు చెల్లిస్తామని తెలిపారు.
వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు వ్యతిరేకించారు. నిర్మాతల నిర్ణయాన్ని అంగీకరించమని, ఫెడరేషన్ను విభజించేలా వేతనాల నిర్ణయం ఉందని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆరోపించారు. రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు ఒకే విధంగా వేతనాలు పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. నిర్మాతలు విధించిన 4 షరతులకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఫిల్మ్ ఫెడరేషన్ కుండబద్ధలు కొట్టింది.
యూనియన్ల ఐక్యతను దెబ్బతీసేలా నిర్మాతల నిర్ణయాలు ఉన్నాయని, రేపటి (ఆదివారం) నుంచి తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకత్వం స్పష్టం చేసింది. ఇలా.. నిర్మాతలకు, ఫిల్మ్ ఫెడరేషన్కు మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో టాలీవుడ్ షూటింగ్స్ బంద్ ఎప్పటివరకూ కొనసాగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.