కరోనాకు రానున్న 90 రోజులు అత్యంత కీలకం

కరోనాకు రానున్న 90 రోజులు అత్యంత కీలకం

మళ్లీ విజృంభించే అవకాశం ఉంది

రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు హెచ్చరిక

వరంగల్ అర్బన్: మహమ్మారి కరోనాకు రానున్న 90 రోజులు అత్యంత కీలకమైనవని.. మళ్లీ విజృంభించే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు  హెచ్చరించారు.  కరోనాతోపాటు.. సీజనల్ వ్యాధి నివారణ చర్యల పై సమీక్షించిన ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం చలికాలం కావడంతోపాటు.. పండుగలు కూడా జరుగుతుండడంతో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. చలికాలం సీజనల్ వ్యాధులతోపాటు కోవిడ్ కూడా విజృంభించే అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు. భవిష్యత్ లో  వచ్చే వాక్సిన్ కోసం ఎదురుచూడడం కంటే….మాస్క్ పెట్టుకోవడం.. భౌతిక దూరం పాటించడం  లాంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కోవిడ్ వైరస్ తగ్గిపోయింది… వాక్సిన్ వస్తోందని  భ్రమలతో ఉండొద్దని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగే అవకాశం ఉంది.. వైరస్ వ్యాప్తి లో సెకండ్, థర్డ్ కాదు మల్టిపుల్ వేవ్స్ చాలా ఉంటాయన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది సీజనల్ వైరస్ వ్యాధులు 50 శాతం తగ్గిపోయాయని..  కోవిడ్ ను ఇప్పటి వరకు ఎదుర్కొన్న విధంగానే వచ్చే 3 నెలలు ఛాలెంజ్ గా తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు.

మళ్లీ లాక్ డౌన్ విధించే పరిస్థితి తీసుకురావొద్దు..

మనం ఆరోగ్యంగా ఉన్నామని ధీమాగా ఉన్నా.. ఇంట్లోని వృద్దులు, అనారోగ్యం ఉన్న వారిని కోవిడ్ అటాక్ చేయొచ్చు… కరోనాతో ఎన్నో కుటుంబాలు కోలుకోలేని రీతుల్లో ఇబ్బందులు పడ్డాయి.. పడుతున్నాయి.. మరెంతో మంది ప్రాణాలు కోల్పోయారు.. మళ్లీ లాక్ డౌన్ విధించే పరిస్థితులు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు. రాష్ర్టంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాము.. ఇప్పటికే 44 లక్షల మందికి టెస్టులు చేశాం.. ప్రస్తుతం 17,742 మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా సిమ్ టమ్స్ ఉన్న వాళ్లు ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దు.. ఆఫీసులు, బస్టాండ్ లు జనసమర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు 16 వందల మందిని కోల్పోయాం.. 70 శాతం మందికి వైరస్ సోకినట్టే తెలీదు.. కాబట్టి సంక్రాంతి వెళ్లేదాక జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు.

హాస్పిటల్స్ లోని కోవిడ్ 19 సెంటర్స్ కొనసాగిస్తాం

వివిధ హాస్పిటళ్లలో ఉన్న 19 కోవిడ్ సెంటర్లు కొనసాగిస్తామని.. రోగుల సంఖ్య తగ్గినప్పటికీ సంక్రాంతి వరకు పనిచేస్తాయని డాక్టర్ శ్రీనివాసరావు తెలిసారు. కోవిడ్ సెంటర్లను మరింత బలోపేతం చేస్తామన్నారు. ప్రతి జిల్లాకు ఒక  కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఉంటుందన్నారు.