గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి..గో మహా హారతిలో ఆర్.కృష్ణయ్య

గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి..గో మహా హారతిలో ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని చర్చించేలా రాజ్యసభలో  మాట్లాడుతానని ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్​లో ఆదివారం విశ్వహిందు మహా సంఘ్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో  ఉదయం నుంచి సాయంత్రం వరకు గో మహా హారతి నిర్వహించారు. ఇందులో ఆర్ .కృష్ణయ్య పాల్గొని గోవులకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 

గోవులను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలను తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని,  తన వంతు బాధ్యతగా ప్రధాని మోదీతో చర్చించి రాజ్యసభలో మాట్లాడుతానన్నారు. విశ్వహిందూ మహాసంఘ్ జాతీయ కన్వీనర్ మహంతి ముఖేశ్ నాథ్, కో కన్వీనర్ లక్ష్మీ, డాక్టర్ సమత, గ్లోబల్ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ చౌహన్ , లవ్ ఫర్ కవ్ ఫౌండేషన్ చైర్మన్ జస్మత్ పటేల్, దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.