ఢిల్లీలో రైతుల ఆందోళన పోలీసుల కాల్పులు.. రైతు మృతి

ఢిల్లీలో రైతుల ఆందోళన పోలీసుల కాల్పులు.. రైతు మృతి
  •     ఢిల్లీలోకి చొచ్చుకెళ్లేందుకు రైతుల ప్రయత్నం..
  •     టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
  •     ఆందోళనలో పాల్గొన్న 160 మంది రైతులకు గాయాలు
  •     పోలీసులకూ గాయాలైనయ్​

చండీగఢ్/న్యూఢిల్లీ : ఢిల్లీ బార్డర్ రణరంగంగా మారింది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో మార్చ్’ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతులతో నాలుగు దఫాలుగా చర్చలు జరిపించింది. అయినా, ఫలితం లేకపోవడంతో రైతులు తమ ఆందోళనలు ఉధృతం చేశారు. బుధవారం 11 గంటల్లోపు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరినా.. కేంద్రం స్పందించలేదు. దీంతో 14వేల మంది రైతులు, 1,200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సుల్లో ఢిల్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పంజాబ్, హర్యానా వద్ద ఉన్న శంభు, ఖనౌరీ బార్డర్​లో బుల్డోజర్​లు, ఐరన్ రాడ్లతో బారికేడ్లు, ఇనుప కంచెలు తొలగించేందుకు రైతులు ప్రయత్నించగా.. హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. రైతులను చెదరగొట్టేందుకు డ్రోన్ల సాయంతో టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లు వాడారు. ఈ ఘటనలో ఖనౌరీ బార్డర్ వద్ద భటిండాకు చెందిన 21 ఏండ్ల శుభ్ కరణ్ సింగ్ అనే రైతు చనిపోయాడు. 160 మందికి పైగా గాయపడ్డారు. వీరిని పటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్​కు తరలించారు. అయితే, యువ రైతు చనిపోయాడన్న వార్తను హర్యానా పోలీసులు ఖండించారు. ఖనౌరీ బార్డర్​లో రైతు చనిపోయాడన్నది ఉట్టి పుకార్లు అని కొట్టిపారేశారు. రైతుల రాళ్ల దాడిలో పోలీసులే గాయపడ్డారని ప్రకటించారు. కాగా, శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకుంటే హర్యానా పోలీసులే తమను రెచ్చగొడ్తున్నారని రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మండిపడ్డారు.

రైతులకు సహకరిస్తే కేసు: హర్యానా పోలీసులు

హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతో కొందరు రైతులు పొలాల్లోకి పరుగులు పెట్టారు. మరికొందరు మాస్క్​లు, కండ్లద్దాలు పెట్టుకుని బుల్డోజర్లతో బారికేడ్లు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జేసీబీ ఆపరేటర్లకు హర్యానా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘మీ భారీ మెషినరీతో ఆందోళనకారులకు సహకరించవద్దు. వాటితో పంజాబ్, హర్యానా బార్డర్ వద్ద మోహరించిన భద్రతా సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతాయి. మా ఆదేశాలు లెక్కచేయని వారిపై చట్టప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చారు. రైతులకు పంజాబ్ పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. జేసీబీలతో హర్యానాలో చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న రైతులను అడ్డుకోవడం లేదన్నారు.

జాగ్రత్తగా ఉండండి :  పంజాబ్ డీజీపీ

శంభు, ఖనౌరీ, అంబాలా బార్డర్​ల వద్ద హర్యానా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు బద్దలు కొట్టేందుకు రైతులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. జేసీబీలు, ప్రొక్లెయిన్లు బార్డర్ వద్దకు చేరుకోకుండా తాము అడ్డుకుంటున్నామని చెప్పారు. సరిహద్దుల వద్ద డ్యూటీలో ఉన్న పారా మిలటరీ బలగాలు, హర్యానా పోలీసులు అలర్ట్​గా ఉండాలని సూచించారు. భారీ మెషినరీలను వెంటనే సీజ్ చేయాలని కోరారు. పంజాబ్ పోలీసులు సహకరిస్తారని తెలిపారు.

మరోసారి చర్చలకు రండి :  అర్జున్ ముండా

పంజాబ్‌‌, హర్యానా బార్డర్ శంభు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో కేంద్రం రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ట్విట్టర్​లో పోస్టు పెట్టారు. ‘‘రైతుల డిమాండ్లపై మరో దఫా చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. చర్చలకు రైతు సంఘం నాయకులను మరోసారి ఆహ్వానిస్తున్నాను. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం ముఖ్యం’’ అని పేర్కొన్నారు. రైతుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, వారి డిమాండ్లు పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

రెండు రోజులు ఆందోళనలకు బ్రేక్​..

ఖానౌరీ సరిహద్దులో హర్యానా పోలీసులు ప్రయోగించిన టియర్‌‌ గ్యాస్‌‌ షెల్ తగిలి 21 ఏండ్ల శుభ్ కరణ్ సింగ్ అనే రైతు చనిపోయాడు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో భటిండా జిల్లా బాలోకే గ్రామానికి చెందిన శుభ్​కరణ్ సింగ్​కు షెల్ తగలడంతో అస్వస్థత కు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మరో ముగ్గురు రైతులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. శుభ్ కరణ్ సింగ్ మృతిపై రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆందోళనలకు తాత్కాలికంగా రెండు రోజుల పాటు ఆపేస్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి.