పబ్​లు డబుల్

పబ్​లు డబుల్
  • 30 నుంచి 80 దాటిన సంఖ్య  
  • రాష్ట్రం వచ్చినంక ఇబ్బడిముబ్బడిగా అనుమతులు 
  • స్పెషల్ ఫీజు కడితే 24 గంటలూ నడుపుకోవచ్చు
  • కొత్తగా 159 బార్లు, 405 వైన్స్‌‌కు పర్మిషన్

హైదరాబాద్‌‌, వెలుగు: ఆబ్కారీ శాఖ ఆదాయంపైనే దృష్టి పెడుతోంది. పబ్ లు, బార్లు, వైన్స్ ఏర్పాటుకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇస్తోంది. ఎవరూ అడగకున్నా బార్లు, వైన్స్ టైమింగ్స్ ను పెంచిన ఆబ్కారీ శాఖ.. స్పెషల్‌‌ ఫీజు చెల్లిస్తే పబ్ లను 24 గంటలూ నడుపుకునేందుకు పర్మిషన్ ఇస్తోంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 30 వరకు పబ్‌‌లు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య దాదాపు 80 దాటింది. కొన్నిచోట్ల అనుమతులు లేకుండానే పబ్ లు నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ వచ్చాక 2,216 వైన్స్‌‌లు ఉండగా, ఇటీవల ఒకేసారి 404 కొత్త వైన్స్ కు అనుమతి ఇచ్చారు. దీంతో వైన్స్ సంఖ్య 2,620కి చేరింది. ఇక 2014లో 1,060 బార్లు ఉండగా, ఇటీవల 159 కొత్త బార్లకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో వాటి సంఖ్య 1,219కు పెరిగింది. బడా నేతల రిఫరెన్స్‌‌తో ఎప్పటికప్పుడు ఎలైట్‌‌ బార్లకు అధికారులు

పర్మిషన్ ఇస్తూనే ఉన్నారు. 
ఇటీవల పబ్ లో డ్రగ్స్ దొరకడంతో అందరి దృష్టి వాటిపై పడింది. వాస్తవానికి స్టేట్‌ ఎక్సైజ్‌ యాక్ట్‌లో పబ్‌ అనే పదం ఎక్కడా లేదు. పబ్‌కు ప్రత్యేకంగా పర్మిషన్‌ అంటూ ఏమీ ఉండదు. సాధారణంగా ఎక్సైజ్‌ అధికారులు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు పర్మిషన్‌ ఇస్తారు. ఇందులో డ్రింక్‌, ఫుడ్‌, లైట్‌ సౌండ్స్‌కు అనుమతి ఉంటుంది. కానీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కే హెవీ సౌండ్‌, డ్యాన్స్‌ ఇతర వాటిని జోడించి.. అందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకుంటున్నారు. దీన్నే పబ్‌గా పిలుస్తున్నారు. 

ఎవరూ అడగకున్నా టైమింగ్స్ పెంపు... 
రాష్ట్రంలో బార్లు, వైన్స్‌ల టైమింగ్స్ ను ఎవరూ అడగకున్నా ఆబ్కారీ శాఖ పెంచింది. ఎక్కువ సేపు ఓపెన్‌లో ఉంటే అధికంగా అమ్మకాలు జరిగి ఆదాయం ఎక్కువ వస్తుందని భావించి.. 2018లో వైన్స్‌, బార్ల టైమింగ్స్ ను సవరించింది. గతంలో వైన్స్‌ ఉదయం 10 గంటలకు ఓపెన్ చేసి, రాత్రి 10 గంటలకు మూసేసేవారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 11 గంటల వరకు పొడిగింపు ఇచ్చారు. సాధారణ రోజుల్లో బార్లను మూసేసే టైమ్ రాత్రి 12 గంటల వరకు ఉంటే.. హైదరాబాద్‌లో మాత్రం శని, ఆదివారాల్లో ఒంటి గంట వరకు పెంచారు. ఇక స్పెషల్ ఫీజు కడితే పబ్ లను 24 గంటలు నడిపించుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. ఇందుకోసం ఏటా రూ.15 లక్షలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇటీవల డ్రగ్స్‌ పట్టబడిన రాడిసన్‌ హోటల్ లోని పబ్‌ కూడా మరో ఏడాది పాటు 24 గంటలు నడుపుకోవడానికి మార్చి 15న అనుమతులు తీసుకుంది. హైదరాబాద్‌లో ఇలాంటివి 10కి పైగా ఉన్నాయని అధికారులు చెప్పారు. కాగా, టైమింగ్స్‌ పెంపును మద్యం దుకాణాల యజమానులు కూడా వ్యతిరేకిస్తున్నారు. టైమింగ్స్‌ పెంచడం వల్ల అనేక రకాల అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు.

తనిఖీల్లేవ్...  
సాధారణంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ల నిర్వహణపై నిఘా ఉన్నట్లుగానే పబ్‌లపైనా ఎక్సైజ్‌ అధికారులు నిఘా కొనసాగించాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. కొన్ని ప్రత్యేక సందర్భా ల్లో ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నా, నామమాత్రంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. కొన్ని పబ్‌లపై ఆ మాత్రం కేసులు కూడా నమోదు చేయడం లేదు. మైనర్‌లను పబ్బుల్లోకి అనుమతించడం, టైమింగ్స్‌ పాటించకపోవడం తదితర నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.