కొలీజియం తుది నిర్ణయమే వెల్లడిస్తాం : సుప్రీం

కొలీజియం తుది నిర్ణయమే వెల్లడిస్తాం : సుప్రీం
  • ఆర్టీఐ యాక్టివిస్టు పిటిషన్​ విచారణ సందర్భంగా కామెంట్

న్యూఢిల్లీ: కొలీజియం మీటింగ్ వివరాలను బయటకు చెప్పలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ‘‘కొలీజియం కొంతమందితో కూడిన వ్యవస్థ. మీటింగ్​లలో జరిగే చర్చలు, తాత్కాలిక నిర్ణయాలను బయటకు చెప్పలేం. కొలీజియంలోని సభ్యులందరూ ఫైనల్​గా తీసుకునే నిర్ణయాన్నే బయటకు వెల్లడిస్తాం. సభ్యులందరూ తీర్మానించి, సంతకాలు చేస్తేనే అది ఫైనల్ డెసిషన్ అవుతుంది” అని కోర్టు తెలిపింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్​లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ తీర్పు చెప్పింది. 2018 డిసెంబర్ 12న జరిగిన కొలీజియం మీటింగ్ వివరాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ యాక్టివిస్టు అంజలీ భరద్వాజ్ వేసిన పిటిషన్​ను కొట్టివేసింది. అంజలీ భరద్వాజ్ మొదట ఆర్టీఐ కింద కొలీజియం మీటింగ్ వివరాలు కోరగా అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకు వెళ్లారు. కాగా, 2018 డిసెంబర్ 12న అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ లోకూర్, జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని కొలీజియం సమావేశమైంది. అయితే ఆ వివరాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయలేదు. జస్టిస్ లోకూర్ రిటైర్ అయిన తర్వాత 2019 జనవరి 10న కొలీజియం మరోసారి సమావేశమైంది. డిసెంబర్ లో జరిగిన మీటింగ్​లో ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని పేర్కొంది.  

వైద్య విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపండి.. 

ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగొచ్చిన మెడికల్ స్టూడెంట్ల సమస్యకు పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ స్టేజ్​లోనే పరిష్కారం కనుగొనాలని, లేదంటే స్టూడెంట్ల కెరీర్ గాడి తప్పుతుందని ఆందో ళన వ్యక్తంచేసింది. ఇందుకు అవసరమైతే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.