మోత్కూర్ సింగిల్ విండో చైర్మన్ పై అవిశ్వాసం

మోత్కూర్ సింగిల్ విండో చైర్మన్ పై అవిశ్వాసం
  • డీసీవోకు లెటర్ ఇచ్చిన 9 మంది డైరెక్టర్లు

మోత్కూరు, వెలుగు : మోత్కూరు రైతు సేవ సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి (బీఆర్ఎస్) పై ఆ సంఘం డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటించారు. చైర్మన్ అశోక్ రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, డైరెక్టర్ల సంతకాలు ఫోర్జరీ చేస్తూ నిధులు డ్రా చేస్తున్నారని 9 మంది డైరెక్టర్లతోపాటు వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసి యాదాద్రి డీసీవో వెంకట్ రెడ్డికి నోటీస్ అందజేశారు. సంఘంలో చైర్మన్ తో సహా 13 మంది డైరెక్టర్లు ఉన్నారు.

సంఘానికి 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం ఎన్నుకోగా, 2025 ఫిబ్రవరి 15తో పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంఘానికి ఎన్నికలు జరగడంతో ప్రస్తుత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తన కొడుకు అశోక్ రెడ్డిని గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3, బీజేపీ ఒక డైరెక్టర్ స్థానాన్ని గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ మెజార్టీ డైరెక్టర్లు గెలవడంతో అశోక్ రెడ్డి చైర్మన్ అయ్యారు.

ప్రస్తుతం ప్రభుత్వం మారడం, కొందరు డైరెక్టర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చైర్మన్ అశోక్ రెడ్డితోపాటు మరో ముగ్గురు డైరెక్టర్లు సామ పద్మా రెడ్డి, దేవసరి రాములు, పురుగుల మల్లయ్య ముందుగానే వచ్చి సంతకాలు చేసి మిగతా సభ్యులు రానందున సమావేశం వాయిదా వేసి వెళ్లిపోయారు.

మిగతా 9 మంది డైరెక్టర్లు 10:30 కు కార్యాలయానికి రాగా, సమావేశం వాయిదా వేశారని సీఈవో వరలక్ష్మి చెప్పడంతో తాము రాకముందే ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. ఆ వెంటనే డైరెక్టర్లు భువనగిరి వెళ్లి చైర్మన్ పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.