20మంది డాక్టర్లకు ఆరుగురే..

20మంది డాక్టర్లకు ఆరుగురే..
  • ఆపరేటర్లు లేక నిరుపయోగంగా ఎక్స్ రే, ఈసీజీ

  • అప్ గ్రేడ్ అయి ఎనిమిది నెలలైనా సౌలతులు కరువు

  • ఇబ్బందుల్లో 24 గ్రామాల ప్రజలు

కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ ప్రభుత్వాసుపత్రి ఒకప్పుడు సాధారణ ప్రసవాల్లో నెంబర్ వన్.  మండలంలోని 24 గ్రామాల ప్రజలకు ఇదే పెద్ద దిక్కు. ఏ చిన్న గాయమైనా, నొప్పి వచ్చినా ప్రజలు ఇక్కడికే వస్తుంటారు. ఈ పీహెచ్​సీ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్ల కింద పీహెచ్​సీ నుంచి సీహెచ్​సీ(కమ్యూనిటీ హెల్త్ సెంటర్) గా మార్చింది. 10 బెడ్ల నుంచి 30 బెడ్లకు అప్ గ్రేడ్ అయింది. ఇందుకోసం 2017లో బిల్డింగ్ కూడా నిర్మించారు. కానీ సీహెచ్​సీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. దాదాపు నాలుగున్నరేండ్ల నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్​లో సీహెచ్​సీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ దవాఖానాలో సౌలతులు కల్పించకపోవడం, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో నేడు సమస్యలకు నిలయంగా మారింది.

డాక్టర్ల కొరత..

కమలాపూర్ సీహెచ్​సీ అప్ గ్రేడ్ అయి ఏడు నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం పూర్తి స్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని నియమించలేదు. 20మంది డాక్టర్లకు గాను ప్రస్తుతం ఆరుగురు మాత్రమే సేవలందిస్తున్నారు. వారు కూడా డిప్యుటేషన్ పైనే పనిచేస్తున్నారు. దీనికి తోడు సిబ్బంది కూడా సరైన సంఖ్యలో లేరు. రెండేసి చొప్పున ల్యాబ్ టెక్నీషియన్లు, ఎంఎన్ వో, ఎఫ్ ఎన్ వోలు, సెక్యూరిటీ గార్డ్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగు వార్డ్ బాయ్స్ , ఆరు ఆపరేటర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.

ఆపరేటర్లు లేక మెషిన్లు మూలకు..

సీహెచ్​సీలో ఎక్స్ రే, ఈసీజీ మెషిన్లు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ఆపరేటర్లను నియమించకపోవడంతో అవి మూలకుపడ్డాయి. ఆపరేషన్లకు అవసరమయ్యే పరికరాల కొరత కూడా వేధిస్తోంది. రక్త, మలమూత్ర పరీక్షలు చేసే పరికరాలు కూడా లేవు. దీంతో రోగులు ప్రైవేటులో టెస్టులు చూయించుకుంటూ రూ.వేలల్లో నష్టపోతున్నారు. ఆసుపత్రిలో జనరేటర్ లేకపోవడంతో కరెంట్ పోతే.. అన్నీ మెషిన్లు బంద్ అవుతున్నాయి. ఈ ఆసుపత్రిలో మార్చురీ ఏర్పాటుకు అనుమతులు వచ్చినా.. గది కొరత కారణంగా మార్చురీ మెషిన్ నిరుపయోగంగా మారింది. ఆసుపత్రిలో కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా లేవు. దీంతో ఇక్కడికి వచ్చిన పేషెంట్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి, పూర్తి స్థాయిలో సౌలతులు కల్పించాలని కోరుతున్నారు.