కాంగ్రెస్​లో ఈటల సెగ..రెండుగా చీలిన లీడర్లు

కాంగ్రెస్​లో ఈటల సెగ..రెండుగా చీలిన లీడర్లు


హైదరాబాద్​, వెలుగు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ వ్యవహారం.. కాంగ్రెస్​లో కాక రేపింది. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారందరినీ సీఎం కేసీఆర్​ కక్షగట్టి బయటకు గెంటేస్తున్నారంటూ కాంగ్రెస్​ లీడర్లు ఈటలకు మద్దతుగా నిలిచారు. పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డితో పాటు వర్కింగ్​ప్రెసిడెంట్​రేవంత్​ రెడ్డి, జీవన్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, దాసోజు శ్రవణ్​, సంపత్​ కుమార్​తో పాటు చాలా మంది లీడర్లు ఈటల పక్షాన మాట్లాడారు. టీఆర్​ఎస్​లోని మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాలు, ఆక్రమణలపై పవర్​పాయింట్​ ప్రెజెంటేషన్​ ఇచ్చి మరీ జనాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. అయితే, పార్టీ హుజూరాబాద్​ నియోజకవర్గ ఇన్​చార్జి పాడి కౌశిక్​ రెడ్డి మాత్రం ఈటలకు వ్యతిరేకంగా గొంతెత్తారు. ఆయనపై ఎన్నెన్నో ఆరోపణలు చేశారు. అదే ఇప్పుడు కాంగ్రెస్​లో చీలికకు కారణమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పొన్నం ఫిర్యాదు

కౌశిక్​ రెడ్డి వరుస ప్రెస్​మీట్లు పెట్టి ఈటల మీద భూకబ్జాలు, ఆక్రమణల ఆరోపణలు చేశారు. ఆయన తీరుపై కాంగ్రెస్​లోని కొందరు సీనియర్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉంటూ టీఆర్​ఎస్​ డైరెక్షన్​లో పనిచేస్తున్నాడంటూ మండిపడుతున్నారు. దీనిపై రెండ్రోజుల కిందట పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్కం ఠాగూర్​కు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​ ఫిర్యాదు కూడా చేశారు. ఇటు ఈటల వ్యవహారంపై పార్టీ వైఖరేంటో క్లారిటీ ఇవ్వాలంటూ ఉత్తమ్​కూ లేఖ రాశారు. ఈటల విషయంలో పార్టీ అనుసరిస్తున్న తీరు ఇప్పుడు సరిగ్గా లేదని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్​ లీడర్లు టీఆర్​ఎస్​ ఎజెండాతో మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై పార్టీ ముఖ్యులతో మీటింగ్​ పెట్టి పార్టీ వైఖరిపై కార్యాచరణను వెల్లడించాలని కోరారు.  

ఉత్తమ్​ అండతోనే అంటూ..

ఉత్తమ్​కు కౌశిక్​ రెడ్డి దగ్గరి చుట్టం. దీంతో ఆయన అండతోనే కౌశిక్​ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడని పార్టీలో బహిరంగ చర్చ జరుగుతోంది. అందుకే ఈటల ఎపిసోడ్​పై ఉత్తమ్​ అంటీముట్టనట్టుగా ఉంటున్నాడని మిగతా లీడర్లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈటల వ్యవహారం టీఆర్​ఎస్​ పార్టీ వ్యవహారమన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. హుజూరాబాద్​ నుంచి ఈటలపై పోటీ చేస్తామని ప్రకటించారు. హుజూరాబాద్​ ఇన్​చార్జిగా ఉన్న కౌశిక్​రెడ్డే బరిలో ఉంటాడని చెప్పుకొచ్చారు. కౌశిక్​ను జగ్గారెడ్డి వెనకేసుకొచ్చినట్టు మాట్లాడడంతో.. పార్టీ నేతలు ఎవరికివారు సొంత స్టాండ్​ తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల సీఎల్పీ నేత భట్టిని కలిసిన ఈటల.. తనను సపోర్ట్​ చేయాలని కోరడం కాంగ్రెస్​లో గందరగోళానికి కారణమైంది.