కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన ఈసీ.. ఆ EVMలు ఇక్కడివే..

కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన ఈసీ.. ఆ EVMలు ఇక్కడివే..

న్యూఢిల్లీ : మే 10వ తేదీన జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) గతంలో దక్షిణాఫ్రికాలో వాడారని ఆరోపించిన కాంగ్రెస్ వ్యాఖ్యలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తోసిపుచ్చింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే "పుకార్లను"  నమ్మవద్దని, ఆరోపణలను బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘం కాంగ్రెస్‌ను కోరింది.

దక్షిణాఫ్రికాలో వినియోగించిన ఈవీఎంలను కర్ణాటక ఎన్నికల్లో వాడారంటూ కాంగ్రెస్ ఎంపీ, కర్ణాటక ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా మే 8వ తేదీన ఈసీకి లేఖ రాశారు. కాంగ్రెస్ ఎంపీ రాసిన లేఖపై ఈసీ సమాధానమిచ్చింది.దక్షిణాఫ్రికాకు ఈవీఎంలను ఎప్పుడూ పంపలేదని ఈసీ స్పష్టం చేసింది. 

ఏ దేశం నుంచి కూడా ఈవీఎంలను దిగుమతి చేసుకోలేదని ఈసీ పేర్కొంది. దక్షిణాఫ్రికా ఈవీఎం యంత్రాలను ఉపయోగించలేదని తెలిపింది. కర్ణాటక ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) తయారు చేసిందని, ఈ విషయం కాంగ్రెస్‌కు ప్రత్యేకంగా తెలుసని ఈసీ పేర్కొంది.