కొత్త వీసీలకు కసరత్తు..మే 21తో ముగియనున్న వీసీల పదవీకాలం

కొత్త వీసీలకు కసరత్తు..మే 21తో ముగియనున్న వీసీల పదవీకాలం
  •     ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేసిన విద్యాశాఖ 
  •     కమిటీల భేటీకి ఈసీ అనుమతి కోరిన అధికారులు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో సర్కారీ వర్సిటీలకు త్వరలోనే కొత్త వైస్ చాన్స్ లర్లు రానున్నారు. వీసీల నియామకానికి సంబంధించిన కసరత్తును విద్యాశాఖ వేగవంతం చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న వీసీల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో, ఆలోపు రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తిచేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (హైదరాబాద్), జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (హైదరాబాద్), కాకతీయ యూనివర్సిటీ (వరంగల్), మహాత్మాగాంధీ యూనివర్సిటీ (నల్లగొండ), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్), తెలంగాణ యూనివర్సిటీ(నిజామాబాద్), పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్ నగర్), జవహర్ లాల్ నెహ్రూ ఆర్టికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్​ఏఎఫ్​ఏయూ–హైదరాబాద్)ల వీసీల పదవీకాలం ఈ నెల 21తో ముగియనున్నది. ఆలోపే కొత్తవారిని నియమించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జనవరిలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆయా వర్సిటీల వీసీ పోస్టుల కోసం 312 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏజ్ లిమిట్ పెట్టకపోవడంతో ఒక్కొక్కరు రెండు నుంచి ఐదు వరకూ వర్సిటీలకు దరఖాస్తు చేయగా, మొత్తం1,382 అప్లికేషన్లు వచ్చాయి. అత్యధికంగా అంబేద్కర్ వర్సిటీకి 208, ఓయూకు193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మాగాంధీ వర్సిటీకి157 దరఖాస్తులు అందాయి. అప్లికేషన్లను హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు స్ర్కూటినీ చేసి సర్కారుకు పంపించారు. మరోపక్క సెర్చ్ కమిటీలనూ సర్కారు నియమించింది. అయితే, 70 ఏండ్లు దాటిన వాళ్లూ దరఖాస్తు చేసుకోవడంతో 65 ఏండ్ల వరకే కటాఫ్ పెట్టాలనే యోచనలో విద్యాశాఖ ఉన్నది.  

సెర్చ్ కమిటీల భేటీకి రెడీ.. 

ప్రస్తుతం ఒక్కో సెర్చ్ కమిటీలో యూజీసీ నామినీతో పాటు వర్సిటీ నామినీ, సర్కారు నామినీ ఉంటారు. ఈ కమిటీ సమావేశాలను నిర్వహించేందుకు విద్యాశాఖ రెడీగా ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎన్నికల కమిషన్ పర్మిషన్ కోసం విద్యాశాఖ లేఖ రాసింది. ఎలక్షన్ కోడ్ జూన్ ఫస్ట్ వీక్ వరకూ ఉంటుంది. దీంతో సెర్చ్ కమిటీల భేటీ తర్వాత ఆ పేర్లను ప్రకటించాలన్నా మళ్లీ ఈసీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ముందుగానే సెర్చ్ కమిటీల భేటీతో పాటు, కొత్త వీసీల నియామకానికి పర్మిషన్ ఇవ్వాలని ఈసీకి లేఖ రాశారు. త్వరలోనే పర్మిషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈసీ అనుమతి రాగానే అన్ని వర్సిటీల సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ రెండు వర్సిటీలకు వీసీలెప్పుడు?

విద్యాశాఖ పరిధిలో 12 యూనివర్సిటీలు ఉండగా ప్రస్తుతం10 వర్సిటీలకే వీసీలను నియమిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఏర్పాటు చేసిన ఆర్జీయూకేటీ (బాసర ట్రిపుల్ ఐటీ)కి తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ రెగ్యులర్ వీసీ లేరు. వర్సిటీ యాక్ట్ ప్రకారం చాన్స్ లర్ ను నియమించిన తర్వాతే, వీసీని నియమించాల్సి ఉంటుంది. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వర్సిటీనే పట్టించుకోలేదు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు వీసీని నియమిస్తుందనే ఆశ అందరిలో ఉంది. మరోపక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోఠి విమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా యూనివర్సిటీగా మార్చింది. కానీ, బడ్జెట్ లో పెట్టిన నిధులు ఇవ్వకపోగా, నియమకాలూ చేపట్టలేదు. అయితే, ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత వర్సిటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసి, నియామకాలపైనా దృష్టి పెడ్తారని అధికారులు చెప్తున్నారు.