- బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
రామాయంపేట, వెలుగు : తెలంగాణలో బీసీల రాజకీయ శకం ఆరంభమైందని, ఇక ఏ శక్తీ అడ్డుకోలేదని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆయన రామాయంపేట పట్టణ శివారులోని ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఇటీవల గెలిచిన బీసీ సర్పంచ్‌లను సన్మానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 56.36 శాతం బీసీల జనాభా ఉందని, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిందన్నారు.
బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దానిని అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 12,736 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో 2,176 పంచాయతీలే బీసీలకు కేటాయించారన్నారు. అందుకే బీసీలు జనరల్ స్థానాల్లో పోటీ చేసి 51 శాతం గెలిచారన్నారు.
బీసీలు పల్లెలను కైవసం చేసుకొని ఢిల్లీ బాట పట్టాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వేణుమాధవ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం, నాయకులు మల్లేశం గౌడ్, పోచమ్మల శ్రీనివాస్, చింతల శేఖర్, శ్రీశైలం, శంకర్‌గౌడ్, గణేశ్, సర్పంచ్‌లు రామకిష్టయ్య, బక్కయ్యగారి యాదగిరి పాల్గొన్నారు.
