భూమి దక్కదని గుండె ఆగింది

భూమి దక్కదని గుండె ఆగింది
  • రైతు పొలంలో టవర్​వేశారు
  • సొరంగం తవ్వారు
  • మళ్లీ కాలువ నిర్మాణంలో పోతున్న భూమి

సిద్దిపేట రూరల్, వెలుగు: మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ కు వెళుతున్న కాలువలో తన భూమి పోతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు గుండెపోటుతో చనిపోయాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని చిన్న గుండవెల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన ఎల్లయ్య(60)కు ఎకరం 20 గుంటల భూమి ఉంది. వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు. 132 కేవీ సోలార్ పవర్ లైన్ టవర్​కు పొలంలోని ఒక గుంట భూమి పోయింది. తర్వాత కొన్ని రోజులకే రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు తరలించడానికి ఎల్లయ్య భూమి నుంచే 50 మీటర్ల వెడల్పుతో సొరంగం తవ్వారు. అటు టవర్​ఉండటం.. ఇటు భూమి కింద సొరంగం ఉండటంతో భూమికి మార్కెట్ లో విలువ పడిపోయిందని రైతు తీవ్రంగా బాధపడ్డాడు. ప్రస్తుతం మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ కు కాలువ ద్వారా నీటిని తరలించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించి విడుదల చేసిన పేపర్ ప్రకటనలలో అతని భూమి ఉంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై శనివారం గుండెపోటుకు గురై చనిపోయాడు. మృతుడికి భార్య శంకరవ్వ, ఒక కూమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు రైతులు మాట్లాడుతూ మరణించిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కాలువ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని కోరారు. కాలువ నిర్మాణానికి వ్యతిరేకంగా చిన్నగుండవెల్లిలో భూ నిర్వాసితులు చేస్తున్న దీక్షలు 125 రోజులకు చేరుకున్నాయి.