- బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
- ప్రధానిని త్వరలోనే కలుద్దామన్న మాజీ గవర్నర్ దత్తాత్రేయ
హైదరాబాద్ , వెలుగు: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఒకవేళ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే వేలాది మంది బీసీలతో అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఆల్‌పార్టీ నేతలు, బీసీ సంఘాల నాయకులతో కలిసి జాయింట్ మీటింగ్నిర్వహించారు.
ఈ సమావేశానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేత వీహెచ్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, టీజేఎస్ నేత పల్లె వినయ్, సీపీఐ నేత ధనుంజయ నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
బీసీ రిజర్వేషన్లపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, కేంద్రప్రభుత్వంపైన ఒత్తిడి పెంచడానికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల అంశం జాతీయ పరిధిలో ఉందని, బీసీ సంఘాలు ఒక్కతాటి మీదికి వచ్చి రిజర్వేషన్ల పెంపు కోసం జాతీయస్థాయిలో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు . ప్రధాని మోదీని త్వరలోనే కలుద్దామని పేర్కొన్నారు. ఆయనను ఒప్పించి బీసీ రిజర్వేషన్లను సాధిద్దామని వెల్లడించారు.
