ఏడాదిలో రూ.1.39 కోట్ల మందులు సీజ్.. డీసీఏ 2025 యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్

ఏడాదిలో రూ.1.39 కోట్ల మందులు సీజ్.. డీసీఏ 2025 యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ, నకిలీ మెడిసిన్ల మాఫియాపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఉక్కుపాదం మోపింది. 2025లో రికార్డు స్థాయిలో దాడులు నిర్వహించి ఏకంగా  రూ. 1.39 కోట్ల విలువైన మందులను సీజ్ చేసింది. మొత్తం 84 రకాల మెడిసిన్లు నాసిరకమని తేల్చేసింది. డీసీఏ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నలుగురు డీలర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. 

2025 ఏడాదికి సంబంధించి డీసీఏ తన వార్షిక నివేదికను బుధవారం విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఏడాదిలో డీసీఏ తనిఖీలు, చర్యల వివరాలను స్పష్టంగా వివరించింది.  కాగా, రాష్ట్రంలో అమ్ముతున్న మందుల్లో 84 రకాలు నాసిరకం (నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ) అని తేలింది.2025 ఏడాది పొడవునా మొత్తం 4,801 శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా.. అందులో 84 ఫెయిల్ అయ్యాయి.

వీటిని తయారు చేసిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు డీసీఏ అధికారులు తెలిపారు. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ మందులు తయారు చేస్తున్న కేటుగాళ్లను పట్టుకున్నామన్నారు. అలర్జీలకు వాడే మోంటెక్- ఎల్సీ, కొలెస్ట్రాల్ టాబ్లెట్లు, మూర్ఛ వ్యాధికి వాడే లెవిపిల్-500 పేరిట నకిలీవి తయారు చేసి అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు.

నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని డీసీఏ ఆఫీసర్లు చెప్పారు.  కాగా, సాధారణంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసి...  లైసెన్సులు రద్దు చేయడం వరకే పరిమితమయ్యేవారు. కానీ 2025లో సీన్ మారింది. నకిలీ మందుల తయారీదారుల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించింది. డీసీఏ చరిత్రలోనే తొలిసారిగా నలుగురు డీలర్లను అరెస్ట్ చేయించి జైలుకు పంపారు. కోర్టుల్లోనూ వాదనలు బలంగా వినిపించడంతో ఒక్క ఏడాదిలోనే 217 కేసుల్లో నేరస్థులకు శిక్షలు ఖరారయ్యాయి.