ముంబై: పశ్చిమాసియా సంక్షోభం ఇంకా కొనసాగుతుండడం, ఫలితంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో గత వారం 2 శాతానికిపైగా పడ్డ సెన్సెక్స్, నిఫ్టీ ఈ వారం కోలుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను వాయిదా వేయడంతో పాటు ఇండియాపై యూఎస్ అదనపు సుంకం రేటు పొరుగుదేశాల కంటే తక్కువగా ఉండడంతో సోమవారం మార్కెట్ లాభాల్లో కదిలే అవకాశం ఉంది.
కానీ, బుధవారం వెలువడే ఫెడ్ పాలసీ వరకు వోలటాలిటీ కనిపించొచ్చు. వీటితో పాటు కీలక కంపెనీల క్యూ1 త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం మార్కెట్‌పై ఉంటుంది. గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,091 పాయింట్లు (2.67శాతం), ఎన్ఎస్ఈ నిఫ్టీ 566 పాయింట్లు (2.32శాతం) నష్టపోయాయి.
ప్రభావితం చేసే అంశాలు
గ్లోబల్ పరిస్థితులు, చమురు ధరలు: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి. హార్మూజ్ జల సంధిలో రవాణా నెమ్మదించగా, ఎర్రసముద్రంలో బాబ్ ఆల్‌మండేబ్ జల సంధి దగ్గర కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో క్రూడాయిల్ ధరలు 100 డాలర్లకు చేరాయి. ఆయిల్ ధరలు గరిష్టాల్లో ఉంటే ఇండియాలో ఇన్‌ఫ్లేషన్ పెరిగే ప్రమాదం ఉంది.
యుఎస్ ఫెడ్ పాలసీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మీటింగ్ వివరాలు ఈ నెల 29 న వెలువడనున్నాయి. వడ్డీ రేట్లను తగ్గిస్తే ఇండియా వంటి ఎమర్జింగ్ మార్కెట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ, అమెరికాలో ఇన్‌ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లో ఉండడంతో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని అంచనా.
క్యూ1 ఫలితాలు: ఈ వారం కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ, హిందూస్థాన్ యూనిలీవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, ఐటీసీ, సన్ ఫార్మా ఫలితాలు రానున్నాయి. జూన్ నెల ఐఐపీ డేటా 28 న వెలువడనుంది.
