సమ్మెపై ఇవ్వాళ తుది నిర్ణయం

సమ్మెపై ఇవ్వాళ తుది నిర్ణయం

కోర్టు ఆర్డర్ అందగానే
ప్రకటిస్తామన్న జేఏసీ
ఈ రోజు సడక్​బంద్​ వాయిదా
దీక్షలు విరమించిన
అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి
నేడు అన్ని యూనియన్ల
కేంద్ర కమిటీల సమావేశాలు
సమ్మెపై చర్చ.. ఆ తర్వాత ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మెపై మంగళవారం తమ నిర్ణయం ప్రకటిస్తామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత కార్మికులతో సమావేశమై ఈ అంశంపై చర్చిస్తామని ప్రకటించారు. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, మంగళవారం తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని తెలిపారు. కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం, యజమాన్యం, కార్మికుల మధ్య మంచి వాతావరణంలో చర్చలు జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సమస్యలు పరిష్కరించాలని, కార్మికులను చర్చలకు పిలవాలని కోరుతూ రెండు రోజులుగా దీక్ష చేస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి సోమవారం దీక్షను విరమించారు.

వారికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. హైకోర్టులో తీర్పు వెల్లడైందని, తమ డిమాండ్లను రెండు వారాల్లోగా పరిష్కరించాలని సర్కారును ఆదేశించిందని చెప్పారు. సమ్మె ఇల్లీగల్ అని తాము ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.  కార్మికులు విధులకు హాజరైతే ప్రశాంత వాతావరణం కల్పించాలని సర్కారుకు సూచించిందని తెలిపారు. ఈ  మేరకు భవిష్యత్​ కార్యాచరణను నిర్ణయించుకునేందుకు ఆర్టీసీలోని అన్ని యూనియన్లు మంగళవారం విడిగా కేంద్ర కమిటీల సమావేశాలు
నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది: కోదండరాం

అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఆరోగ్యం క్షీణించిందని, దీంతో అన్ని పార్టీల నేతల ఒత్తిడి మేరకు వారు దీక్ష విరమించారని కోదండరాం తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆందోళన తప్పనిసరిగా కొనసాగుతుందని కోదండరాం స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి నుంచి అన్ని పార్టీల నేతలం చర్చిస్తున్నామని, ప్రభుత్వానికి అప్పీలు చేద్దామని అనుకున్నామని, కానీ సర్కారు నుంచి స్పందన కరువైందని కోదండరాం అన్నారు. ఏం చేయాలన్న దానిపై మీమాంస ఏర్పడిందని చెప్పారు. ప్రభుత్వం, పోలీసులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని కోదండరాం మండిపడ్డారు.

ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడిని కాను: రాజిరెడ్డి

ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిపై హైదరాబాద్​లోని ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం దీక్ష సందర్భంగా రాజిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని, కార్మికులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ పోలీసులు 309,506 సెక్షన్ల కింద కేసు ఫైల్​ చేశారు. కేసు నమోదు కావడంపై రాజిరెడ్డి మండిపడ్డారు. ఎల్బీ నగర్ పోలీసులు తనపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయటం ఏమిటని ప్రశ్నించారు.  ఆత్మహత్య చేసుకునే పిరికివాణ్ని అయితే ఈ స్థాయిలో ఉండనని తెలిపారు. ఎన్నో సార్లు కేసులు నమోదు చేశారని, ఉద్యమాలు చేశామని, జైలుకు కూడా వెళ్లామని చెప్పారు.పోలీసులు దౌర్జన్యంగా తలుపులు, తాళాలు పగులగొట్టి అక్రమంగా తన ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారని అన్నారు. తన ఇంటికి తాళం వేసి ఇప్పటివరకు తాళం చెవి ఇవ్వలేదని తెలిపారు. పోలీసులు బేషరతుగా తమ తప్పును ఒప్పుకొని తాళంచెవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులను సంప్రదించి
హెచ్‌ఆర్సీకి వెళ్తానన్నారు.