జీహెచ్​ఎంసీలో ఫస్ట్​ డే 21,666 మందికి వ్యాక్సిన్

జీహెచ్​ఎంసీలో ఫస్ట్​ డే 21,666 మందికి వ్యాక్సిన్
  • 32 సెంటరల్లో రిస్క్ టేకర్లకు వ్యాక్సినేషన్ స్టార్ట్
  • టోకెన్లు ఉన్నోళ్లకి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు..
  • తెలియక వచ్చిన బస్తీ ప్రజలను వెనక్కి పంపిన ఆఫీసర్లు
  • మరో తొమ్మిది రోజులు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రిస్క్​ టేకర్ల ​కోసం చేపట్టిన స్పెషల్ ​వ్యాక్సినేషన్ ​డ్రైవ్ ​జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం మొదలైంది. బల్దియా అధికారులు 30 సర్కిళ్లలో మొత్తం 32 సెంటర్లు ఏర్పాటు చేయగా మొదటి రోజు 21,666 మంది వ్యాక్సిన్​తీసుకున్నారు. ఫస్ట్​డే 30 వేల మందికి ఫస్ట్​డోస్​ వేయాలని టార్గెట్​పెట్టుకోగా అందులో 70 శాతం మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. డ్రైవ్​లో భాగంగా ఒక్కో సెంటర్​నుంచి వెయ్యి మందికి గురువారమే టోకెన్లు అందజేయగా కొన్నిచోట్ల 500 నుంచి 600 మంది మాత్రమే వచ్చారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ వేస్తున్నారనుకొని బస్తీల ప్రజలు సెంటర్లకు తరలిరాగా అధికారులు తిప్పి పంపించేశారు. కొన్నిసెంటర్లలో రిస్క్​టేకర్స్​కాని వారికి టోకెన్లు ఇచ్చిన వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలిసింది. ఆయా ఏరియాల్లో జరిగిన వ్యాక్సినేషన్​ప్రాసెస్​ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్ శ్వేతామహంతి, కమిషనర్​లోకేశ్​కుమార్​తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పరిశీలించారు.

అనుకున్న స్థాయిలో రాలే
బన్సీలాల్​పేటలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్​లో జరిగిన వ్యాక్సినేషన్ లో 950 మందికి టోకెన్స్ ఇవ్వగా 650 మంది మాత్రమే వ్యాక్సిన్​తీసుకున్నారు. జనాలు ఒకేసారి రావడంతో సోషల్ డిస్టెన్స్ లేకుండా పోయింది. ఈ సెంటర్​లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​వ్యాక్సినేషన్​ప్రారంభించారు. శేరిలింగంపల్లి సర్కిల్​పరిధిలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్​లో 1000 మందికి టోకెన్స్ ఇవ్వగా 857 మంది వాక్సిన్ తీసుకున్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ లో టీకా వేశారు. ఇక్కడ 621 మంది టీకా తీసుకున్నారు. అల్వాల్​లో ఏర్పాటు చేసిన వాక్సిన్ సెంటర్​ను మేడ్చల్ జిల్లా ఇన్​చార్జ్ కలెక్టర్ శ్వేతామహంతి పరిశీలించారు. ఇక్కడ 847 మందికి వాక్సిన్లు వేశారు. కాప్రాలో 950 టోకెన్లు ఇవ్వగా 799 మందికి, ఉప్పల్ సర్కిల్ లో వెయ్యి టోకెన్లు ఇవ్వగా 737 మంది వ్యాక్సిన్​వేశారు. ముషీరాబాద్ గవర్నమెంట్​స్కూల్​లో ఏర్పాటు చేసిన సెంటర్​లో 693 మందికి వ్యాక్సిన్ వేశారు. కొంతమంది టోకెన్లు లేకుండా నేరుగా రావడంతో అధికారులు తిప్పి పంపించేశారు. షాద్​నగర్​డివిజన్​లోని పీహెచ్​సీలో 455 మందికి, కొడంగల్​లో 50 మందికి, బొంరాస్​పేటలో 30 మందికి వ్యాక్సిన్ వేశారు. కుత్బుల్లాపూర్ లో 723 మంది, గాజులరామారంలో 698 మంది, ప్రగతి నగర్​లో 261 మంది టీకాలు తీసుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మొత్తం 4 సెంటర్లు ఏర్పాటు చేయగా శివరాంపల్లిలో 890, బుద్వేల్ లో 60, శంషాబాద్​లో 117, నార్సింగిలో199 టోకెన్లు ఇవ్వగా 16 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. కూకట్​పల్లి, మూసాపేట సర్కిల్స్ పరిధిలోని నయినా గార్డన్స్, ఎన్​కేఎన్ ఆర్ గార్డెన్స్, కూకట్ పల్లి జడ్పీ స్కూల్, జూనియర్ కాలేజీ, ఫతేనగర్ సెంటర్స్ లో రిస్క్​టేకర్స్​కు వ్యాక్సిన్​వేశారు. మూసాపేట సర్కిల్ పరిధిలో 840 మంది, కూకట్పల్లి సర్కిల్ పరిధిలో 815 మంది,  చందానగర్ సర్కిల్ పరిధిలో 865 మందికి వ్యాక్సిన్ వేశారు.

టోకెన్లు లేని 100 మందికి కూడా
సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్​మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన సెంటర్​ను డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రారంభించారు. ఇక్కడ 895 మందికి వాక్సిన్లు వేశారు. ఒక్కసారిగా జనం రావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. టోకెన్లు లేకుండా వచ్చిన100 మంది తమకు కూడా వాక్సిన్ వేయాలంటూ ఆందోళన చేయడంతో అంతా అయిపోయాక వారి ఆధార్​కార్డు నంబర్లు తీసుకుని వ్యాక్సిన్​వేశారు.

క్యాబ్ డ్రైవర్లు ఆగమాగం
అల్వాల్ కు చెందిన కిరణ్ కార్ఖానాలోని వ్యాక్సినేషన్​సెంటర్ కు వెళ్లగా తిప్పి పంపించేశారు. ఇదేంటని అడిగితే క్యాబ్ డ్రైవర్లకు టీకా ఇవ్వాలని ఆదేశాలు అందలేని హెల్త్ సిబ్బంది చెప్పారు. సికింద్రాబాద్ లోని మరో సెంటర్ వెళ్లినా అదే పరిస్థితి. ఆర్టీవో, బల్దియా, ట్రాఫిక్, హెల్త్ సిబ్బంది మధ్య సమన్వయ లోపంతో ఇలా జరిగిందని తెలిసింది.ఓలా, ఉబెర్ సంస్థల్లో పనిచేసే డ్రైవర్లకు ఆయా కంపెనీల పరిధిలోని కార్యాలయాలు, సెంటర్ల వద్ద టీకా డ్రైవ్ నిర్వహించాలని ట్యాక్సీ డ్రైవర్స్ జేఎసీ చైర్మన్ సల్లావుద్దీన్ సూచించారు. ప్రతి ఒక్క డ్రైవర్ కు టీకా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సిబ్బందిపై సీఎస్ ​సోమేశ్ ​ఫైర్​
వ్యాక్సినేషన్​ ప్రాసెస్​ను పరిశీలించేందుకు గోషామహల్​పరిధిలోని రెడ్ రోస్ ఫంక్షన్ హాల్​కు వచ్చిన సీఎస్ సోమేశ్ కుమార్ పలువురితో మాట్లాడారు. ప్రభుత్వం గుర్తించిన వారు కాకుండా వేరే వారు ఉండటంతో సిబ్బందిపై సీఎస్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ లోకేశ్​కుమార్ ని ఆదేశించారు. బాధ్యులుగా గోషామహల్ డీసీ శ్రీనివాస్​తోపాటు ఏఎంహెచ్​ఓకు మెమోలు జారీ చేశారు.