తుపాకులు, బాంబులతో ఇజ్రాయేల్ వచ్చిన అమెరికా యుద్ధ విమానాలు

తుపాకులు, బాంబులతో ఇజ్రాయేల్ వచ్చిన అమెరికా యుద్ధ విమానాలు

ఇజ్రాయేల్​, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయేల్ ప్రతిదాడులతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. హమాస్ పై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన ఇజ్రాయేల్ ... ఉగ్రవాదుల కేంద్రమైన గాజాపై దాడులను మరింత స్పీడ్​ పెంచింది.

ఇజ్రాయేల్ కు భారత్​ తో పాటు అమెరికా మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన తొలి విమానం ఇజ్రాయేల్ కు చేరుకుంది. అమెరికా ఆయుధాలతో కూడిన తొలి విమానం మంగళవారం (అక్టోబర్ 10వ తేదీన)  సాయంత్రం దక్షిణ ఇజ్రాయెల్‌లో దిగినట్లు ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) తెలిపింది. 

అయితే.. అమెరికా నుంచి ఎన్ని ఆయుధాలు వచ్చాయనే విషయాన్ని మాత్రం ఐడీఎఫ్​ చెప్పలేదు. హమాస్ పై ప్రతిదాడులకు దిగుతున్న  ఇజ్రాయేల్ కు మద్దతుగా అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆయుధాలను పంపించారు.

మరోవైపు.. ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మూడోసారి ఫోన్​ లో మాట్లాడారు. ఇజ్రాయేల్ లోని ప్రస్తుత పరిస్థితులను వివరించారు. హమాస్​ పై దాడి తీవ్రత ఎలా పెంచాలనే విషయాలపై ఇరువురూ మాట్లాడారని తెలుస్తోంది.

Also Read : ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం : కుప్పకూలిన ఇళ్లు

ఓవైపు గగనతలం నుంచి యుద్ధ విమానాలతో ఇజ్రాయిల్  విరుచుకుపడుతూ.. మరోవైపు సరిహద్దు ప్రాంతాలను తిరిగి తమ అధీనంలోకి తీసుకోవడంలో ఇజ్రాయెల్‌ సైన్యం నిమగ్నమైంది. ఇందుకోసం దాదాపు 3 లక్షల మంది రిజర్వు సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఈ స్థాయిలో రిజర్వులను ఎన్నడూ సిద్ధం చేయలేదని, తాము యుద్ధం వైపు వెళ్తున్నామని  ఇజ్రాయేల్ సైన్యం వెల్లడించింది.

హమాస్‌ మిలిటెంట్లు వందమందికిపైగా ఇజ్రాయేల్ సైనికులు, పౌరులను అపహరించారు. బందీల్లో మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఉండటంతో ఎటుచూసినా భావోద్వేగ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బందీలుగా ఉన్న వారి కోసం ఇజ్రాయెల్‌ సైన్యం తాజా ఘర్షణల్లో దూకుడుగా వ్యవహరించలేకపోతోంది. ఒకవైపు హమాస్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడాలన్న ఇజ్రాయెలీ అతివాదుల డిమాండ్లు.. మరోవైపు బాధిత కుటుంబాల కన్నీటి వినతులు.. వీటి మధ్య నెతన్యాహు ప్రభుత్వం అయోమయంలో చిక్కుకుపోయింది.

వెయ్యి మందికిపైగా ఇజ్రాయెలీల ప్రాణాలను తీసిన హమాస్‌కు దీటైన బదులివ్వాలని నెతన్యాహు సర్కారుపై మిత్రపక్ష పార్టీల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. హమాస్‌ డిమాండ్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ తలొగ్గడానికి వీల్లేదని శక్తిమంతమైన అతివాద మంత్రులు స్పష్టం చేస్తున్నారు. బందీల అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా హమాస్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడాలని ఆర్థిక మంత్రి బెజాలెల్‌ స్మోట్రిచ్‌ డిమాండ్‌ చేశారు.