ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అమెరికా , ఇరాన్ మద్య శాంతి ఒప్పందానికి సోమవారం ( జూన్ 14) డీల్ కు కుదిరింది. యుద్దాన్ని విరమించేందుకు రెండు దేశాలు ముందుకు వచ్చాయి. శాంతి ఒప్పందంతో ఈ వారం చివరలో హార్ముజ్ జలసంధిని తెరుచుకోనుంది. మిడిల్ ఈస్ట్ లో శాంతి మార్గం సుగమం అయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుటపడే అవకాశం ఉంది.
సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తర్వాత ఇరాన్ , అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంపై జూన్ 19 న స్విట్జర్లాండ్ లోని జెనీవాలో సంతకాలు చేయనున్నాయి. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరు అయ్యే అవకాశం ఉందని డిప్యూటీ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటించారు.
జూన్ 19న శాంతి ఒప్పందం సంతకాలు చేయనున్నట్లు ఇరాన్ కూడా ప్రకటించింది. అయితే ఆన్ లైన్ లో సంతకాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది.ఇరాన్ తరపున ఎవరు హాజరు అవుతారనేది స్పష్టత లేదు. టెహ్రాన్ తరపు చర్చలలో ముందుండి నడిపిస్తున్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేఱ్ ఘాలిబాఫ్ గానీ, విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చీ గానీ హాజరయ్యే అవకాశం ఉంది.
అయితే హోర్ముజ్ జలసంధిపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, ఇరాన్ ఆస్తులను విడుదల, లెబనాన్ పై దాడులు వంటి అంశాలపై వాషింగ్టన్ కట్టుబాట్లను నెరవేరుస్తుందో లేదో చూసేందుకు, సమగ్ర ఒప్పందం ఖరారయ్యే ముందు 60 రోజుల పాటు వేచి చూస్తామని ఇరాన్ ఇంతకుముందే తెలిపింది.
మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చల్లో పెద్దగా పురోగతి లేదు.. ఇరాన్ యురేనియంను అప్పగించాలని, అణ్వాయుధ నిర్మాణాన్ని ఆపాలని ట్రంప్ కోరుకుంటున్నారు. కానీ, తమ కార్యక్రమం పౌర ఉపయోగం కోసమేనని టెహ్రాన్ వాదిస్తోంది. అందువల్ల, శాంతి ఒప్పందంలో అత్యంత వివాదాస్పద అంశమైన అణు సమస్య చివరికి ఎలా పరిష్కారమవుతుందో అస్పష్టంగానే ఉంది.
