న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రముఖ నగరాలకు నేరుగా విమాన సర్వీసులను నడిపేందుకు ఉన్న అవకాశాలను ఎయిర్ న్యూజిలాండ్ పరిశీలిస్తోందని కంపెనీ సీఈఓ నిఖిల్ రవిశంకర్ తెలిపారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) వల్ల ఇరు దేశాల ప్రజల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రెజిల్‌లో జరిగిన ఐఏటీఏ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి కనెక్టివిటీని పెంచేందుకు తాము పనిచేస్తున్నామని, ఎయిర్ ఇండియాతో కోడ్‌షేర్ ఒప్పందం కూడా ఉందని నిఖిల్ చెప్పారు.
‘‘మార్చి 2025 నాటి ఒప్పందం ప్రకారం 2028 చివరి నాటికి భారత్-న్యూజిలాండ్ మధ్య నేరుగా సర్వీసులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ఎయిర్‌లైన్స్ సేవల కోసం భారతదేశానికి చెందిన టీసీఎస్, ఐబీఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాం”అని రవి శంకర్ తెలిపారు. బెంగళూరులో జన్మించిన నిఖిల్ రవిశంకర్, అక్టోబర్ 2025లో ఎయిర్ న్యూజిలాండ్ బాధ్యతలు చేపట్టారు.
