- ప్రతి ముగ్గురిలో ఒకరు అనుమతి లేకుండా స్టాక్స్ రికమండ్ చేస్తున్నారు
- 37 శాతం మంది స్పాన్సర్లు, బ్రాండ్ల వివరాలను బయటపెట్టడం లేదు
- 27 శాతం మంది కీలక వివరాలను దాస్తున్నారు: సీఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్
ముంబై: సామాజిక మాధ్యమాలలో ఆర్థిక సలహాలు, పెట్టుబడి చిట్కాలు ఇచ్చే 'ఫిన్‌ఫ్లూయెన్సర్ల' (ఫైనాన్సియల్ ఇన్‌ఫ్లూయెన్సర్ల) తీరుపై చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ ( సీఎఫ్ఏ) సంచలన వివరాలను బయటపెట్టింది. వీరిలో కేవలం 6.3 శాతం మంది మాత్రమే సెబీ వద్ద రిజిస్టర్ అయ్యారని, ప్రతి ముగ్గురిలో ఒకరు ఎలాంటి అనుమతులు లేకుండా డైరెక్ట్‌గా స్టాక్ రికమండేషన్స్ ఇస్తున్నారని తన "క్లిక్స్ అండ్ క్రెడిబిలిటీ 2.0" రిపోర్ట్‌లో పేర్కొంది.
కిందటేడాది జనవరి–-అక్టోబరు మధ్య ఇండియాలో పాపులర్ అయిన 48 మంది ఫిన్‌ఫ్లూయెన్సర్లపై సర్వే చేసింది. వీరిలో 16 మంది (33.3శాతం) ఏ కంపెనీ షేర్లు కొనాలి, అమ్మాలి లేదా హోల్డ్ చేయాలో స్పష్టమైన సిఫార్సులు ఇస్తున్నారు.
ఈ 16 మందిలో ఇద్దరే సెబీ గుర్తింపు పొందినవారు ఉన్నారు. మిగిలిన 66.7శాతం మంది పర్సనల్ ఫైనాన్స్, బడ్జెటింగ్ లేదా ఎడ్యుకేషనల్ కంటెంట్‌ను మాత్రమే అందిస్తున్నారు. వీరిలో ఒకరు సెబీ వద్ద నమోదై ఉండగా, మిగిలిన 31 మందికి ఎటువంటి అనుమతులు లేవు. మొత్తంగా ముగ్గురు మాత్రమే సెబీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాగా, సెబీ అనుమతులు పొందుతున్న ఇన్‌ఫ్లూయెన్సర్ల సంఖ్య పెరుగుతోంది. గతేడాది 2శాతం ఉన్న రిజిస్టర్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్ల సంఖ్య ఇప్పుడు 6.3శాతానికి పెరిగింది.
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లే వేదిక
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లు ఫిన్‌ఫ్లూయెన్సర్లకు వేదికలుగా మారాయి. సీఎఫ్‌ఏ సర్వే చేసిన క్రియేటర్లలో 98శాతం మంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, 83.3శాతం మంది యూట్యూబ్ షార్ట్స్, 79.2శాతం మంది నిడివి ఎక్కువ ఉండే వీడియోలను ఉపయోగిస్తున్నారు.
వీరు వారానికి కనీసం రెండు సార్లు, 64శాతం మంది రోజూ లేదా రోజు మార్చి రోజు కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారు. సగటున వీరి వయస్సు 32 ఏళ్లు కాగా, 71శాతం మంది పురుషులు ఉన్నారు. సగానికి పైగా ముంబై, ఢిల్లీ- ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాల నుంచే పనిచేస్తున్నారు.
ఆఫ్‌లైన్ సెమినార్లు, క్లోజ్డ్ వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా స్టాక్ సిఫార్సులు చేస్తుండటంతో నియంత్రణ కష్టమవుతోందని సీఎఫ్ఏ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సెబీ వద్ద నమోదైన సలహాదారులకు, సాధారణ క్రియేటర్లకు తేడా తెలిసేలా ప్రత్యేక 'వెరిఫికేషన్ మెకానిజమ్' తేవాలని సలహా ఇచ్చింది.
ప్రమాణాలతో కూడిన డిస్‌క్లోజర్ నిబంధనలు, గైడ్‌లైన్స్ అమలు చేయాలని, అనుమతి లేని అనధికారిక కౌన్సెలర్ల వీడియోలను ఆల్గారిథమ్స్ ద్వారా ప్రమోట్ చేయకుండా సోషల్ మీడియా కంపెనీలపై ఆంక్షలు విధించాలని తెలిపింది. ఏఐ ప్రకటనలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిఫార్సు చేసింది.
సలహాల్లో లోపాలు..
సామాజిక మాధ్యమాల్లో సమాచారం అందించేటప్పుడు బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లు, వ్యాపార ప్రయోజనాల వివరాలు స్పష్టంగా తెలపడంలో ఫిన్‌ఫ్లూయెన్సర్లు తీవ్రంగా విఫలమవుతున్నారు. 37.5 శాతం మంది తమకు బ్రాండ్లతో ఉన్న ఆర్థిక సంబంధాలను లేదా స్పాన్సర్ చేసిన సమాచారాన్ని వీక్షకులకు వెల్లడించడం లేదు.
అలాగే, సుమారు 27 శాతం మంది పెట్టుబడులకు సంబంధించిన పన్నులు, ఫీజులు, లాకిన్ పీరియడ్లు వంటి కీలక అంశాలను చెప్పడం లేదు. ఫలితంగా రిటైల్ పెట్టుబడిదారులు సగం సమాచారంతో నష్టపోయే ప్రమాదం ఉంది.
