అతని పేరు దీపక్ ప్రకాష్.. బీహార్ రాష్ట్ర మంత్రి. పంచాయతీ రాజ్ శాఖ చూస్తున్నారు. ఇప్పుడు ఇతని వ్యవహారం దేశ రాజకీయాల్లోనే కొత్త చర్చకు దారి తీసింది. సుప్రీంకోర్టుకు చేరిన ఈ బీహార్ మంత్రి దీపక్ ప్రకాష్ కేసులో.. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో పాటు.. రాబోయే తీర్పు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే ఆసక్తిగా మారింది.
ఎందుకంటే.. దేశ రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ బీహార్ మంత్రి దీపక్ ప్రకాష్ కేసు ఏంటో పూర్తిగా తెలుసుకుందామా..
ప్రస్తుత బీహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాష్.. ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. ఏ చట్టసభలోనూ ఆయన ప్రాతినిధ్యం వహించటం లేదు. అంటే ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కూడా కాదు. ఇలాంటి దీపక్ ప్రకాష్ కు 2025లో నితీష్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు.. అతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2026 ఏప్రిల్ 15న నితీష్ కుమార్ రాజీనామాతో.. దీపక్ ప్రకాష్ సైతం మంత్రి పదవిని కోల్పోయారు. అప్పటికి ఆయన మంత్రిగా నాలుగు నెలల 26 రోజులు పని చేశారు.
ఆ తర్వాత 22 రోజులు ఆయన ఎలాంటి మంత్రి పదవి లేకుండానే ఉన్నారు. ఎలాంటి హోదా లేదు. 2026, మే 7న సమ్రాట్ చౌదరి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో.. దీపక్ ప్రకాష్ మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని వ్యక్తి.. ఆరు నెలలకు మించి మంత్రి పదవిలో కొనసాగకూడదనే ఆర్టికల్ 164(4) నిబంధన ప్రకారం.. దీపక్ ప్రకాష్ ఎలా మంత్రి వర్గంలో కొనసాగుతున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
ఈ పిటిషన్పై విచారణ చేసిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిగా మారాయి. ఇది పూర్తిగా చట్టపరమైన ప్రశ్న. ఎన్నిక కాకుండానే ఒక మంత్రి ఆరు నెలలకు పైగా ఎలా కొనసాగుతున్నారో ప్రభుత్వం వివరించాలంటూ బీహార్ ప్రభుత్వాన్ని CJI ప్రశ్నించారు. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ కోసం ఆగస్ట్ 4వ తేదీకి జాబితా చేశారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్.
బీహార్ ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఒకేసారి ఆయన ఆరు నెలలు కొనసాగలేదు.. మొదట మంత్రిగా పని చేసినప్పుడు నాలుగు 26 రోజులు మాత్రమే ఉన్నారని.. మధ్యలో గ్యాప్ వచ్చిందని.. మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలలు పూర్తి కాలేదని అంటోంది. దీనిపైనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది అందరిలో ఆసక్తిగా మారింది. చట్ట సభలకు ఎన్నిక కాని వ్యక్తి మొత్తం ఆరు నెలలు మాత్రమే మంత్రిగా ఉండాలా లేక విడతల వారీగా చూస్తారా అనేది పెద్ద ధర్మ సందేహంగా మారింది.
గతంలో దేశంలోని పరిణామాలు చూస్తే.. మాజీ ప్రధాని దేవగౌడ ప్రధాని అయిన ఆరు నెలల్లోనే రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. అదే విధంగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరే తర్వాతనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ సీఎం అయిన తర్వాత.. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడటంతో.. ఏకంగా ఆయన ఆరు నెలలకు కొన్ని రోజుల ముందు.. ఏకంగా సీఎం పదవికే రాజీనామా చేశారు.
ఇప్పుడు బీహార్ మంత్రి దీపక్ ప్రకాష్ విషయంలో సుప్రీంకోర్టు విచారణ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. గతంలో ప్రధాని, ముఖ్యమంత్రులు ఆరు నెలల్లోనే చట్టసభలకు ఎన్నిక అయ్యారు. ఇప్పుడు దీపక్ ప్రకాష్ కు మధ్యలో గ్యాప్ వచ్చిందని.. దీన్ని ఎలా చూడాలి అనేది ఇప్పుడు ప్రశ్న. మాజీ ప్రధానులు, మాజీ ముఖ్యమంత్రులకే లేని మినహాయింపు.. బీహార్ మంత్రికి ఉంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
