అంగవైకల్యంతో పుట్టిన కొడుకును వదిలేసి, మొగుడిపై అక్రమ కేసులు పెట్టిన భార్య.. ప్రజావాణిలో తండ్రి కన్నీరు

అంగవైకల్యంతో పుట్టిన కొడుకును వదిలేసి, మొగుడిపై అక్రమ కేసులు పెట్టిన భార్య.. ప్రజావాణిలో తండ్రి కన్నీరు

కన్నప్రేమ కరువైంది.. మానవత్వం మంటగలిసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే.. అంగవైకల్యంతో పుట్టాడనే సాకుతో కన్నకొడుకును, కట్టుకున్న భర్తను నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోయినా ఆ తండ్రి మాత్రం కుంగిపోలేదు.. లక్షల రూపాయల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని, మంచానికే పరిమితమైన కొడుకు కోసం అమృతంలా మారాడా తండ్రి. జగిత్యాల జిల్లా ప్రజావాణిలో వెలుగుచూసిన ఈ హృదయవిదారక ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆరు సంవత్సరాల క్రితం కథలాపూర్ మండలం గంభీరావుపేటకు చెందిన సురేష్‌తో, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన రమ్యకు వివాహమైంది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా మూడేళ్ల క్రితం ఒక బాబు జన్మించాడు. అయితే, ఆ బాబు తీవ్ర ఎదుగుదల లోపంతో, అంగవైకల్యంతో పుట్టి మంచానికే పరిమితమయ్యాడు. కన్నబిడ్డ పరిస్థితి చూసి తల్లి మనసు కరగాల్సింది పోయి, రమ్య క్రూరంగా ఆలోచించింది. బాబుకు సేవలు చేయలేక, రెండేళ్ల క్రితం భర్తను, అంగవైకల్యంతో ఉన్న కొడుకును వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది.

భార్య వదిలేసి వెళ్ళినప్పటికీ.. సురేష్ తన సాఫ్ట్‌వేర్ జాబ్ మానేసి, అనునిత్యం కొడుకు సంరక్షణలోనే గడుపుతున్నాడు. ఇంతటితో ఆగని రమ్య.. సురేష్‌పై ఎదురు తిరిగింది. పుట్టింటికి వెళ్లడమే కాకుండా, భర్త సురేష్‌పై పోలీస్ స్టేషన్‌లో అక్రమ వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. అటు మంచంపై ఉన్న కొడుకును చూసుకోవాలో.. ఇటు భార్య పెట్టిన అక్రమ కేసులతో కోర్టుల చుట్టూ, హాస్పిటల్స్ చుట్టూ తిరగాలో తెలియక ఆ తండ్రి మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు. చివరకు భరించలేక, తనకు న్యాయం చేయాలంటూ జగిత్యాల జిల్లా ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, కన్నీరుమున్నీరయ్యాడు ఆ తండ్రి.