నెదర్లాండ్స్‌తో మ్యాచ్ డ్రా.. స్టేడియం శుభ్రం చేసి వెళ్లిన జపాన్ ఫ్యాన్స్!

నెదర్లాండ్స్‌తో మ్యాచ్ డ్రా.. స్టేడియం శుభ్రం చేసి వెళ్లిన జపాన్ ఫ్యాన్స్!

Japanese fans clean trash at Dallas Stadium: ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్-ఎఫ్ లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరు2–2తో డ్రాగా ముగిసింది. స్టేడియంలో ఆటగాళ్లు చూపిన పట్టుదల ఒకెత్తయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జపాన్ ఫుట్‌బాల్ అభిమానులు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి, సామాజిక బాధ్యత ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంది. మ్యాచ్ ముగిసి అందరూ స్టేడియం వదిలి పెట్టిన వెళ్తున్నప్పటికీ, జపాన్ సపోర్టర్స్ మాత్రం అక్కడే ఉండి తాము కూర్చున్న స్టాండ్స్ విభాగం మొత్తాన్ని క్లీన్ చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

క్లీన్ చేసిన జపాన్ ఫ్యాన్స్.. నెటిజన్ల ప్రశంసల జల్లు: 
డల్లాస్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన వెంటనే జపాన్ సపోర్టర్స్ చేతుల్లో నీలిరంగు గార్బేజ్ బ్యాగులు (చెత్త సంచులు) పట్టుకుని రంగంలోకి దిగారు. గ్యాలరీల్లో పారేసిన ప్లాస్టిక్ కప్పులు, వాటర్ బాటిళ్లు, ఫుడ్ కంటైనర్లను ఏరి అండ్ నీట్‌గా సర్దారు. కొన్ని చోట్ల ఇతర దేశాల అభిమానులు కూడా వీరితో కలిసి పని చేయడం విశేషం. గెలుపోటములతో సంబంధం లేకుండా, అంతర్జాతీయ టోర్నమెంట్లలో తాము వెళ్ళిన చోటల్లా స్టేడియంను పరిశుభ్రంగా ఉంచడం జపాన్ క్రీడా సంస్కృతిలో ఒక భాగం.. ఈ క్రమశిక్షణ, గౌరవభావంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నెదర్లాండ్స్‌కు షాకిచ్చిన కమాడా: 
అంతకుముందు పిచ్‌పై జరిగిన పోరులో జపాన్ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచింది. గ్రూప్-ఎఫ్ లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు రెండుసార్లు ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ, జపాన్ అంతే వేగంగా పుంజుకుని గట్టి షాకిచ్చింది. నెదర్లాండ్స్ తరఫున వర్జిల్ వాన్ డయాక్, క్రిసెన్సియో సమ్మర్‌విల్లే గోల్స్ చేయగా, జపాన్ తరఫున కీటో నకమురా మొదటి గోల్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ ముగియడానికి సరిగ్గా రెండు నిమిషాల ముందు (88వ నిమిషంలో) జపాన్ స్టార్ ప్లేయర్ దైచీ కమాడా అద్భుతమైన హెడర్ గోల్‌తో స్కోరును 2–2తో సమం చేసి, తమ జట్టుకు విలువైన ఒక పాయింట్‌ను తీసుకొచ్చాడు. ముగింపు దశ వరకు లీడ్‌లో ఉన్న నెదర్లాండ్స్ ఈ డ్రాతో తీవ్ర నిరాశకు గురైంది.