
భారత పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ రెండు రకాల కార్యనిర్వాహక వర్గాలు ఉంటాయి. రాష్ట్రాల్లో గవర్నర్ ఆధ్వర్యంలో నామమాత్రపు కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రిమండలి ఆధ్వర్యంలో వాస్తవ కార్యనిర్వాహకవర్గం పనిచేస్తుంది. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో ముఖ్య కార్యనిర్వహణాధికారి. రాష్ట్ర ప్రథమ పౌరుడు. రాష్ట్రంలో రాజ్యాంగ అధినేత. రాష్ట్రాధినేతగా పేర్కొంటారు. రాష్ట్రంలో గవర్నర్ అధికారిక నివాసాన్ని రాజ్‌భవన్ అంటారు.
రాజ్యాంగం – గవర్నర్ వ్యవస్థ
రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ 153 నుంచి 167 వరకు వివరించారు. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అడ్వకేట్ జనరల్ ఉంటారు.
గవర్నర్: ఆర్టికల్153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. 7వ రాజ్యాంగ సవరణ(1956) ప్రకారం రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే గవర్నర్‌ను నియమించవచ్చు. ఆర్టికల్ 154 ప్రకారం గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారి. గవర్నర్ రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను గవర్నర్ స్వయంగా గానీ లేక తన కింది అధికారుల ద్వారా గానీ నిర్వర్తిస్తారు.
గవర్నర్ల నియామకం: ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్లను ప్రధాన మంత్రి, మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. గవర్నర్లను నియమించే అధికారం, హక్కు, స్వేచ్ఛ ఈ ఆర్టికల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి అధీనుడు కాదు. ఏజెంట్ కూడా కాదు. ఈ పదవి స్వతంత్ర రాజ్యాంగ పదవి అని 1997లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగ ముసాయిదా పత్రంలో గవర్నర్‌ను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని పేర్కొన్నారు. కానీ, రాజ్యాంగ పరిషత్ మాత్రం అనేక రకాల కారణాల వల్ల గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించాలనే పద్ధతి ఏర్పాటు చేసింది.
గవర్నర్ అధికారాలు
రాష్ట్ర గవర్నర్‌కు ఐదు రకాల అధికారాలు ఉంటాయి.
కార్యనిర్వహణాధికారాలు: ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్ర కార్యనిర్వహణాధికారాలు అన్నీ గవర్నర్‌కు ఉంటాయి. రాష్ట్ర పాలన మొత్తం గవర్నర్ పేరు మీద కొనసాగుతుంది. ముఖ్యమంత్రిని నియమిస్తాడు. అతని సలహాపై ఇతర మంత్రులు, అడ్వకేట్ జనరల్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులు, రాష్ట్ర ఆర్థిక, ఎన్నికల సంఘాల చైర్మన్, సభ్యులను నియమిస్తాడు.
శాసనాధికారాలు: ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా ఉంటాడు. ఈ హోదాలో గవర్నర్‌కు శాసన అధికారాలు ఉంటాయి. రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తాడు. వాయిదా వేస్తాడు. రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. విధాన పరిషత్‌లోని మొత్తం సభ్యులలో 1/6 వంతుల మంది సభ్యులను నామినేట్ చేస్తాడు. గవర్నర్ ఆర్డినెన్సులు జారీ చేస్తాడు. రాష్ట్ర శాసనసభ పంపించిన బిల్లులను ఆమోదిస్తాడు.
ఆర్థిక అధికారాలు: ఆర్టికల్ 199 ప్రకారం ఆర్థిక బిల్లులను గవర్నర్ పూర్వానుమతితో మాత్రమే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలి. రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే బాధ్యత గవర్నర్ కలిగి ఉంటాడు. రాష్ట్ర ఆగంతకనిధి గవర్నర్ నిర్వహిస్తాడు.
న్యాయ అధికారాలు: ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్ రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉన్న న్యాయస్థానం విధించే శిక్షలకు క్షమాభిక్ష పెడతాడు. కానీ, మరణశిక్ష విషయంలో క్షమాభిక్ష అధికారం కేవలం రాష్ట్రపతికి ఉంటుంది. గవర్నర్ కేవలం మరణశిక్షను సస్పెండ్ మాత్రమే చేయగలడు.
విచక్షణాధికారాలు: మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ తీసుకునే నిర్ణయాలను విచక్షణాధికారులు అంటారు.
ఉదా: ముఖ్యమంత్రి నియామకం, మంత్రి మండలి రద్దు, శాసన సభ రద్దు, రాష్ట్రపతి పాలన సిఫారసు చేసే అధికారం, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల విషయంలో మొదలైన సందర్భాలు ఉంటాయి.