మేడ్చల్ కాంగ్రెస్ లో టికెట్​ లొల్లి

మేడ్చల్ కాంగ్రెస్ లో టికెట్​ లొల్లి
  • మేడ్చల్ కాంగ్రెస్ లో టికెట్​ లొల్లి
  • తొలి జాబితాలో వజ్రేశ్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్
  • ఆశించిన  పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డికి మొండిచేయి
  • బుజ్జగించేందుకు వెళ్లిన అభ్యర్థి, జడ్పీటీసీ అనుచరుల మధ్య తోపులాట

కీసర, వెలుగు :  తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ లో అసంతృప్త జ్వాలలు మొదలయ్యాయి. మేడ్చల్ టికెట్ ఆశించి భంగపడిన మూడు చింతలపల్లి జడ్పీటీసీ హరివర్ధన్ రెడ్డి కంటతడి పెట్టుకొని సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన మేడ్చల్ నుంచి టికెట్ ఆశించగా.. తోటకూర వజ్రేశ్​యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించారు. గతంలోనూ టికెట్ కోసం హరివర్ధన్ రెడ్డి  ప్రయత్నాలు చేసినా అధిష్టానం ఇవ్వలేదు. రెండోసారి ఆశించి సెగ్మెంట్ లో పార్టీకి అన్నీ తానై ముమ్మరంగా పర్యటిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

పార్టీ సర్వే లోనూ కచ్చితంగా తనకే అనుకూలంగా వస్తుందని భావించారు. చివరకు టికెట్ రాకపోవడంతో మనోవేదనకు గురయ్యారు. దీంతో ఆదివారం ఉదయం హరివర్ధన్ రెడ్డి తన అనుచరులతో కీసరలో కీలక సమావేశం నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను బుజ్జగించేందుకు అక్కడికి కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్​యాదవ్ రాగా  పలువురు పార్టీ నేతలు అడ్డుకొని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో హరివర్ధన్ రెడ్డి, వజ్రేశ్​యాదవ్ అనుచరులకు మధ్య తోపులాట చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

రాజకీయాలంటే అసహ్యం వేస్తుందని తనను నమ్ముకున్న కార్యకర్తలకు తగిన న్యాయం చేయలేకపోతున్నానని హరివర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు అధిష్టానం చేసిన సర్వే రిపోర్టులను బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన అభ్యర్థుల లిస్టు చూస్తే చేసిన సర్వేలను గాలికి వదిలిపెట్టరని విమర్శించారు. మూడు చింతలపల్లి మండలంను  సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నా.. ప్రజల ఆశీర్వాదంతో తను జడ్పీటీసీగా విజయం సాధించానని గుర్తుచేశారు. అధిష్టానం టికెట్ పై మరోసారి పరిశీలన చేయకపోతే మేడ్చల్ లో రాష్ట్ర నాయకత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.