
హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయ వివాదానికి దారి తీశాయి. ఫ్లెక్సీలకు కూడా టీఆర్ఎస్ పార్టీ రంగును పులిమారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగర ప్రజల నుంచి జీహెచ్ఎంసీ వసూలు చేసే పన్నులతో ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీల్లో అధికార పార్టీ గురించి గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ అధికారులపై ఉందని ఆయన ప్రశ్నించారు.
ఇందుకు నిరసనగా ‘‘రండి కలిసి రండి.. ప్రశ్నిద్దాం పరిష్కరించుకుందాం.. మన నగరం కార్యక్రమానికి స్వాగతం’’ అంటూ మరో ఫ్లెక్సీని కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేయించారు. టీఆర్ఎస్ ను హైలైట్ చేస్తూ జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఆయన తొలగించారు. దీనిపై అధికారులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.