పోడు సాగును అడ్డుకున్న అధికారులు

పోడు సాగును అడ్డుకున్న అధికారులు

నాగర్ కర్నూల్, వెలుగు: ఏండ్ల తరబడి తాము సాగుచేసుకుంటున్న భూముల్లో పంట వేయొద్దని అటవీ అధికారులు అడ్డుకోవడంతో  ఓ గిరిజన మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. భూమి లేకుంటే తామెట్లా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారుల ముందే పురుగుల మందు తాగి పడిపోయింది. నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామ సమీపంలో మ్యాదర్ బండ దగ్గర  ముడావత్ తారాసింగ్, ముడావత్ చంద్రు, గుజ్జ నర్సింహ కుటుంబాలు 30 ఏండ్లుగా 18 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో బుధవారం వ్యవసాయ పనులు ప్రారంభించారు. 3 కుటుంబాలకు చెందినవారు దుక్కి దున్ని విత్తనాలు వేస్తుండగా.. చింతపల్లి సెక్షన్  ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు సత్యం, మహేశ్​, వెంకటయ్య అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని, వ్యవసాయం లేకుంటే ఎట్లా బతకాలని గంట పాటు ఆ గిరిజన కుటుంబాలు అధికారుల కాళ్లావేళ్లా పడ్డాయి. అయినా ఆఫీసర్లు వినలేదు. దీంతో ముడావత్ చంద్రు భార్య దేవి  ఫారెస్ట్ అధికారుల ముందే పురుగుల మందు తాగి  పొలంలో పడిపోయింది. వెంటనే ఆమెను బైక్​పై కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. 

రెండేండ్లుగా ఇబ్బందులు పెడ్తున్నరు
చింతపల్లి ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, నార్లాపూర్, నడివాగు తండా, గుండ్యానాయక్ తండా, గేమ్యానాయక్ తండాల పరిధిలో దాదాపు 3 వేల ఎకరాల పోడు భూములు ఉన్నాయి. ముక్కిడిగుండం సమీపంలోని మ్యాదర్ బండ వద్ద తారాసింగ్, చంద్రు, గుజ్జ నర్సింహ తదితరులు తలా 6  ఎకరాల్లో 30 ఏండ్లుగా సాగు  చేసుకుంటున్నారు. రెండేండ్లుగా ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడ్తున్నారని తారాసింగ్, చంద్రు వాపోయారు. వానాకాలంలో ఒక పంట మాత్రమే  సాగు చేసుకునే తమను విత్తనాలు వేయనివ్వట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు.