దేశంలో పాలకపక్షాలకు కమ్యూనిస్టులు తోకపార్టీలుగా ఉన్నంతకాలం వారు రోజురోజుకూ పలుచనవటమే! జాతీయస్థాయిలో ఒక విధానం, స్థానికంగా మరో వైఖరి వారిని ఎదగనీయటం లేదు. రాజకీయాల్లో సుస్థిరంగా నిలవనీయటం లేదు. దేశ రాజకీయ దేహంలో వారొక ‘అవశేష అవయవం’గా మిగిలే ప్రమాదముంది. ప్రత్యామ్నాయ సామాజిక, ఆర్థిక ఎజెండా ఉన్న వామపక్షాలుగా వారు కొంచెం వెన్నెముక రాజకీయాలు నెరిపితే ప్రజాక్షేత్రంలో అక్కడక్కడైనా నిలవటానికి అవకాశముంది. ఏకపార్టీ పాలన పోయి దేశంలో సంకీర్ణ శకం స్థిరపడ్డాక ‘ఒత్తిడి శక్తులు’గా కమ్యూనిస్టు పార్టీల అవసరం ఎంతో ఉందని కేంద్రంలో యూపీఏ-1 (2004-09) పాలన రుజువు చేసింది. సమాచార హక్కు, విద్యా హక్కు, ఉపాధి హామీ, వైద్య, ఆహారభద్రత, కనీస వేతనాలు... ఇలా దేశానికి మేలుచేసిన ఎన్నో ప్రజోపయోగ చట్టాలు, నిర్ణయాలు అప్పుడే వచ్చాయి. రాష్ట్రంలో పాలక కాంగ్రెస్‌తో పొత్తున్న కమ్యూనిస్టులపై కేరళం ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్, కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడ్డ తీరు భవిష్యత్తులో ఇక్కడ వారి స్నేహంపై సందేహాల నీలినీడలను పరుస్తోంది!.
‘కమలములు నీటబాసిన/ కమలాక్షుని రశ్మిసోకి కమలిన భంగిన్,/ తమతమ నెలవులు తప్పిన/ తమ మిత్రులే శత్రులగుట తథ్యము సుమతీ’! అన్నాడు సుమారు 800 ఏళ్ల కింద సుమతీ శతకకారుడైన బద్దెన. మామూలుగా తమకు నేస్తమైన సూర్యతేజం పొంది వికసించే తామరలు, అడుగున నీరెండిపోయినపుడు మాత్రం అదే సూర్యరశ్మి తీవ్రత వల్ల మలమల మాడిపోతాయని, స్నేహాలు తీరినపుడు మిత్రులే శత్రువులవుతారనేది కవి భావన! ఇవాల్టికీ అదే నిజమని నిరూపిస్తున్నాయి తెలుగునాట చాన్నాళ్లుగా ఏదో ఒక ప్రధాన పార్టీతో అంటకాగుతున్న కమ్యూనిస్టు పార్టీలు. పొత్తుల్లో ప్రధాన పార్టీలకు ఉపయోగపడుతున్నాయే తప్ప ఇందులో రాజకీయంగా కమ్యూనిస్టులు బావుకుంటున్నది అంతంతే! ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నికకు ప్రజాక్షేత్రంలో పలుచనవుతున్నారు. పైగా ఆ పొత్తులేవీ నాలుగు కాలాలు నిలవటం లేదు.
సిద్ధాంత నిబద్ధతలేని పొత్తులు
ఒకసారి ఒకరితో, ఇంకోసారి వారి ప్రత్యర్థులతో... ఇలా సిద్ధాంత నిబద్ధతలేని పొత్తులతో వారి స్వరం బలహీనపడుతోంది. రాజకీయ స్వభావం చెడి ప్రభావం తగ్గుతోంది. ఇప్పుడు తామెక్కడ ఉన్నామో ఉనికి వెతుక్కునే పరిస్థితి! తెలంగాణలో కాంగ్రెస్‌తో సీపీఐకి పొత్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని పోటీచేసి, ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి ఆ పార్టీ రాష్ట్ర నేత కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే అయ్యారు. పొత్తు అవగాహనలో ఇప్పటికే ఒక కార్పొరేషన్ పదవి తీసుకున్న పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఇమ్మని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్నట్టు సమాచారం. అదుగో, ఇదుగో అనటమే తప్ప వారు ఎమ్మెల్సీ స్థానమేమీ ఇవ్వటం లేదు. కేరళంలో అదే సీపీఐ భాగస్వామిగా ఉన్న వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్డీఎఫ్) ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలి ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడ్డ తీరు కమ్యూనిస్టులనే కాదు కాంగ్రెస్ వర్గాలనూ విస్మయపరిచింది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణ సీఎంగా, స్టార్ క్యాంపెయినర్‌గా కేరళం వెళ్లి ప్రచారం, తెలంగాణ సమాచారం ఇవ్వటంవరకు పరిమితమైతే బాగుండేది. కానీ, కమ్యూనిస్టులు కేంద్రంలోని ఎన్డీఏ పాలకపక్షానికి ‘బి- టీమ్’గా వ్యవహరిస్తున్నారని, మోదీ ప్రభుత్వం కమ్యూనిస్టులకు దన్నుగా నిలుస్తోందని విమర్శించడం ఇక్కడ కాంగ్రెస్, - కమ్యూనిస్టు బంధంపై ప్రభావం చూపదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విడిగానే పోటీచేసినా, ఫలితాల తర్వాత ఛైర్మన్ ఎన్నిక కోసం ఉభయులూ కలిశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, - సీపీఐ విడిగానే పోటీ చేయవచ్చనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
సత్తా చాటిన కమ్యూనిస్టులు
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ‘మునుగోడు’ ఉప ఎన్నిక ఫలితాన్ని నాటి పాలకపక్షం బీఆర్‌ఎస్ తో కమ్యూనిస్టుల పొత్తు ఎంతో ప్రభావితం చేసింది. అధికారం, అర్థబలం, విస్తృత యంత్రాంగం, విపక్షాల కట్టడి, మూడున్నరేళ్ల పెండింగ్ పథకాలు అప్పటికప్పుడు అమలు ఇలా.... ఎన్నో సానుకూల అంశాలు ఉండి కూడా పాలకపక్షం కేవలం పదివేల ఓట్లతో నెగ్గడం వెనక కమ్యూనిస్టు పార్టీల మద్దతు పాత్ర ఉంది. బీఆర్ఎస్కు సదరు మద్దతు దొరకక, బీజేపీ అభ్యర్థి ఆ ఉప ఎన్నిక గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయాలు భిన్నంగా ఉండేవి. ఏడాది తర్వాతి అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని అది కచ్చితంగా ప్రభావితం చేసి ఉండేదని పరిశీలకుల భావన! ఎందుకంటే, అప్పటివరకు బీజేపీ వైపా, కాంగ్రెస్ వైపా తేల్చుకోలేక తటస్థంగా వేచి చూస్తున్న ముఖ్య నాయకులంతా ఆ ఫలితం రాగానే కాంగ్రెస్‌లో చేరిపోయారు. బీజేపీ ఉన్నపళంగా బలహీనపడటం, రాష్ట్రంలో కనీస ముక్కోణపు పోటీ పరిస్థితి కూడా తప్పిపోవడం అంతిమంగా కాంగ్రెస్‌కు లాభించింది. ఆ ఉప ఎన్నిక విషయంలో సంయమనం వహించకుండా తొందరపడి బీజేపీ చేతులు కాల్చుకుంది. అప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు గెలిచిన ఊపులో దక్షిణ తెలంగాణలోనూ అటువంటి గెలుపొకటి కావాలని బీజేపీ ఢిల్లీ నాయకత్వం తహతహలాడింది. నాటి మునుగోడు కాంగ్రెస్ అసంతృ ప్తి ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని, అతని పాత మిత్రుడైన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే (జార్ఖండ్) కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కలిపించారు. పార్టీ నాయకత్వం ఆయన్ని బీజేపీలోకి ఆహ్వానించి, రాజీనామా చేయించి ఉప ఎన్నికలో పోటీ చేయించింది.
కమ్యూనిస్టులతో వ్యూహాత్మక పొత్తు
వ్యూహాత్మకంగా నాటి సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. ‘ప్రగతిశీల కమ్యూనిస్టు శక్తులతో మా పొత్తు ఉప ఎన్నికకే పరిమితం కాదు, తర్వాతా కొనసాగుతుంది’ అని పలికిన కేసీఆర్ ఆ తర్వాత ఎందువల్లో వారిని దూరం చేసుకున్నారు. 2023 ఎన్నికల్లో వారికి పొత్తు లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంది. తుది ఫలితం కాంగ్రెస్‌కు అనుకూలించడం తెలిసిందే! కేరళ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్, -సీపీఐ మధ్య ఎడం పెరగొచ్చు. రెండున్నరేళ్ల తర్వాత వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు పాలక కాంగ్రెస్‌ను విబేధించే అవకాశాలున్నాయి. బీజేపీతో పొత్తు ఉండని పక్షంలో బీఆర్ఎస్ కచ్చితంగా కమ్యూనిస్టులతో పొత్తుకు సిద్ధపడుతుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతోంది. ఆ పొత్తుల్లో కొత్తగూడెం, మునుగోడు సీపీఐకి, భద్రాచలం, మిర్యాలగూడ సీపీఎంకు ఇచ్చే విషయంలో బీఆర్ఎస్ పెద్దగా అభ్యంతర పెట్టకపోవచ్చనే అభిప్రాయముంది.
ఓడించగల దిట్టలు
పొత్తుల్లో సహ భాగస్వామ్య పార్టీల్ని కమ్యూనిస్టులు గెలిపించినా, గెలిపించలేకపోయినా.... బలమైన వ్యతిరేక ప్రచారంతో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల్ని ఓడించగలరనే పేరుంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఓ సందర్భంలో ఇది అంగీకరిస్తూ మాట్లాడారు. పూర్వపు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వారికున్న కార్యకర్తల యంత్రాంగం, అనుబంధ విభాగాలు, ఉద్యోగ, -కార్మిక సంఘాల్లో బలంరీత్యా వ్యతిరేక ప్రచారంలో వారిది కీలక పాత్ర! ఇది తాత్కాలిక ప్రయోజనం కలిగించినా దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాన్నే చూపుతోంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీని, ఎన్డీఏను కమ్యూనిస్టులు బలంగా వ్యతిరేకిస్తారు. అందుకే విపక్ష ‘ఇండియా గ్రూప్’తో సఖ్యతగా, సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. కానీ, వివిధ రాష్ట్ర స్థానిక రాజకీయాల్లో ఇండియా కూటమి ప్రధానపక్షమైన కాంగ్రెస్‌తోనే కమ్యూనిస్టులకు విభేదాలున్నాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్-, కమ్యూనిస్టుల మధ్య పొత్తేమీ లేదు. ఆ ఇద్దరికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతోనూ పొసగదు. ఒక దశలో ‘ఇండియా కూటమి’కి నేతృత్వం వహించడానికీ వ్యతిరేకత చూపని మమతా బెనర్జీ విపక్ష ఓట్లు చీలకుండా అటు కాంగ్రెస్‌తో, ఇటు కమ్యూనిస్టులతో అవగాహనో, పొత్తో కుదుర్చుకున్నదే లేదు.
కేరళంలో వామపక్ష కూటమి (ఎల్డీఎఫ్), కాంగ్రెస్
నేతృత్వపు కూటమి (యూడీఎఫ్)లే ప్రధాన ప్రత్యర్థులు. అయితే కాంగ్రెస్, -కమ్యూనిస్టు, ఉభయులూ స్థానిక రాజకీయ పరిస్థితుల్లో వైరుధ్యాలు, పరస్పర వ్యతిరేకతలున్నా... జాతీయస్థాయిలో ఉమ్మడి లక్ష్యమైన బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసం కలిసి పనిచేస్తామని ప్రకటిస్తారు. కానీ, వేర్వేరు రాష్ట్రాల్లో ఉభయుల మధ్య పొసగకపోవడం వల్ల వ్యవహారం వికటిస్తోంది. కాంగ్రెస్ విమర్శల్లో... బీజేపీకి కమ్యూనిస్ట్ కూటమి ‘బి- టీమ్ అనేంతవరకు వెళ్లినపుడు తిరిగి సయోధ్య సాధించడం కష్టమే! ప్రజల దృష్టిలో వారి విశ్వసనీయతకు సంబంధించి ఎంతో కొంత నష్టం తప్పదనే భావన జనంలో ఉంది.
- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
