టెన్త్ పాత మెమోలు ఇక ఆన్ లైన్లో ..

టెన్త్ పాత మెమోలు ఇక ఆన్ లైన్లో ..

హైదరాబాద్, వెలుగు:పాత టెన్త్  మార్కుల మెమో పోయిందా.. జిరాక్స్​కూడా దొరకట్లేదా.. డూప్లికేట్​మెమో కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా.. ఇక ముందు ఈ సమస్యలు తప్పనున్నాయి. రోజుల తరబడి పరీక్షల విభాగం, డీఈవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. సులువుగా టెన్త్​ రికార్డులను పొందే అవకాశం వస్తోంది. ఇటీవలివే కాదు 1958 సంవత్సరం నుంచీ కూడా టెన్త్​ మెమోలు, ఇతర రికార్డులను డిజిటలైజేషన్​ చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఏజెన్సీలను ఎంపిక చేసి.. ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో పని మొదలుపెట్టనుంది. లక్షలాది మంది వివరాలను అప్​లోడ్​ చేయాల్సి ఉండటంతో ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు రెండు, మూడేండ్లు పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

రాష్ట్రంలో ఏటా టెన్త్​ పరీక్షలకు సుమారు ఐదున్నర లక్షల మంది స్టూడెంట్స్ హాజరవుతున్నారు. విద్యా శాఖ టెన్త్ రిజల్ట్స్​విడుదల చేయగానే షార్ట్​ మెమోలను తాత్కాలికంగా వెబ్​సైట్లో పెడుతోంది. పూర్తిస్థాయి మెమోలను ఏటా ఆగస్టు, సెప్టెంబర్​నెలల్లో స్కూళ్లకు పంపుతోంది. అయితే 2014 మార్చి రిజల్ట్స్ నుంచి టెన్త్​ మెమోలన్నీ ఆన్​లైన్లో పెడుతున్నారు. 2004 నుంచీ చదివిన వారి వివరాలు కూడా ఆన్​లైన్లో అందుబాటులోకి తెచ్చారు. కానీ అంతకంటే ముందు టెన్త్​ చదివిన వారి మెమోలు కావాలంటే తిప్పలు తప్పడం లేదు. కొత్త మెమో, డూప్లికేట్  మెమో కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఆ వివరాలను సేకరించేందుకు అధికారులకు రోజుల తరబడి సమయం పడుతుంది. పాత వివరాలన్నీ సక్రమంగా లేకపోవడం, డిజిటలైజ్​కాకపోవడమే కారణం. దాంతోపాటు పాత రిజిస్టర్లు, ఫైళ్లు పాడైపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ట్యాబులేషన్ రిజిస్టర్లు, రికార్డులన్నీ డిజిటలైజేషన్​చేయాలని నిర్ణయించారు.

60 ఏండ్ల కింది నుంచి..

1958వ సంవత్సరం నాటి నుంచీ ఉన్న అన్ని రిజిస్టర్లను డిజిటలైజేషన్ చేయనున్నారు. కీ రిజిస్టర్లన్నింటినీ స్కానింగ్  చేసి ఆన్​లైన్లో నమోదు చేస్తారు. ఏ ఏడాదికా ఏడాది వారీగా, జిల్లాల వారీగా వివరాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. అందులో మెమోలతోపాటు స్టూడెంట్లకు సంబంధించిన ఇతర వివరాలు ఉంటాయి. హాల్ టికెట్ నంబర్​ఎంటర్​ చేస్తే క్షణాల్లో వివరాలన్నీ కనిపిస్తాయి. డూప్లికేట్ మెమోలు, ఇతర వివరాలు పొందాలనుకునే వారికి రోజుల తరబడి వేచి చూసే ఇబ్బంది తప్పనుంది.