మేడిగడ్డ ఏడో బ్లాక్ రిపేర్లకే రూ.1,700 కోట్లు!..కూల్చుడు.. కట్టుడు.. రెండూ కష్టమే!

మేడిగడ్డ  ఏడో బ్లాక్ రిపేర్లకే రూ.1,700 కోట్లు!..కూల్చుడు.. కట్టుడు.. రెండూ కష్టమే!

 

  • మేడిగడ్డ మరమ్మతులకు భారీగా ఖర్చవుతుందని ప్రభుత్వం ఆందోళన 
  • ఆ బ్లాక్‌‌‌‌ను పునాదుల నుంచీ తొలగించి కొత్తగా నిర్మించాలంటున్న ఎక్స్‌‌‌‌పర్ట్స్ 
  •  వాటర్ ​డైవర్షన్‌‌‌‌కు కాఫర్​ డ్యామ్​ అవసరం.. సీకెంట్ ​పైల్స్‌‌‌‌ను తొలగించలేని పరిస్థితి
  • వాటి ప్లేసులో షీట్​ పైల్స్​ వాడితే ఎలా ఉంటుందన్న యోచన 
  • ఎటూ తేల్చుకోలేక ఇరిగేషన్​ అధికారుల్లో అయోమయం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు భారీగా ఖర్చవుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. కుంగిపోయిన ఏడో బ్లాక్ రిపేర్లకే రూ.1,700 కోట్ల దాకా ఖర్చవుతుందన్న అంచనాలతో తలపట్టుకుంటున్నది. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్​2023 అక్టోబర్​21న ఐదున్నర మీటర్ల మేర కుంగింది. నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణులు వచ్చి పరిశీలించి, రిపేర్లు చేయడానికి కొన్ని గైడ్​లైన్స్ నిర్దేశించారు. అందులో భాగంగానే ప్రభుత్వం పుణెకు చెందిన సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్ రీసెర్చ్​స్టేషన్​(సీడబ్ల్యూపీఆర్ఎస్)తో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద టెస్టులు చేయిస్తున్నది.

అయితే మేడిగడ్డ వద్ద పరిస్థితులను చూసిన నిపుణులు.. ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పునాదుల నుంచి పైదాకా 11 గేట్లతో సహా పూర్తిగా తొలగించాల్సిందేనని చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో దానికయ్యే ఖర్చు భారంగా మారింది. ఆ బ్లాక్​మొత్తాన్ని పూర్తిగా పునాదుల నుంచి కట్టాలంటే రూ.1,500 కోట్ల నుంచి రూ.1,700 కోట్ల దాకా ఖర్చవుతుందన్న అంచనాలతో ప్రభుత్వం తలపట్టుకుంటున్నది. 

కూల్చుడు.. కట్టుడు.. రెండూ కష్టమే!

ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా తొలగించి నిర్మించాలంటే నీటి డైవర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో కాఫర్​డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎగువన కట్టాల్సి ఉంటుంది. ఆ కాఫర్​డ్యామ్​నిర్మాణానికయ్యే ఖర్చుతో పాటు అక్కడ వేయాల్సిన అప్రోచ్​రోడ్లు, ఇతర సామగ్రికి అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇటు ఏడో బ్లాక్​ పొడవు 200 మీటర్లకుపైగా ఉంది. బ్యారేజీ ఎత్తుకు తగ్గట్టుగా నిర్మించాలంటే దానికయ్యే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ, స్టీల్, కాంట్రాక్ట్​ ఖర్చులన్నీ కలిసి తడిసి మోపెడవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. సీసీ బ్లాకులు, రాఫ్ట్​లు, గేట్లు, అన్నీ తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూల్చేయాలన్నా పెద్ద శ్రమతో కూడుకున్న పని అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కూల్చేస్తే వాటికున్న మెకానికల్​కాంపొనెంట్లను మళ్లీ తిరిగి వాడుకోలేరని చెబుతున్నారు. అవన్నీ కొత్తగా మళ్లీ సమకూర్చుకోవాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కూల్చేద్దామనుకున్నా.. దానికి ఆనుకుని ఉన్న బ్లాకులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఏంటన్న ఆందోళన కూడా ఇరిగేషన్​శాఖను, ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది. 

సీకెంట్​పైల్స్​పరిస్థితి ఏంటి? 

ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పునాదుల నుంచి మళ్లీ నిర్మించాల్సి ఉండడంతో బ్యారేజీలో వాడిన అత్యంత కీలకమైన కాంపొనెంట్ సీకెంట్​పైల్స్​ పరిస్థితేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బ్యారేజీకి అసలు పునాది అదే కావడం, అది లేనిదే బ్యారేజీ నిలబడలేని పరిస్థితి ఉండడంతో.. ఆ సీకెంట్​పైల్స్​ను ఏం చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తున్నది. ఏడో బ్లాక్ ​ఒక్క దానికే సీకెంట్​పైల్స్​ను తీసేయడం కష్టమన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. సీకెంట్​పైల్స్​ను తీసేయాల్సి వస్తే బ్యారేజీ మొత్తానికే తీసేయాల్సి ఉంటుందని, అది సాధ్యంకాని పని అని ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. ఇప్పుడున్న సీకెంట్​పైల్స్​ను అలాగే ఉంచి.. జెడ్ షీట్​పైల్స్​ను వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచననూ చేస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. మేడిగడ్డకు సంబంధించి ఈ అంశాలన్నింటి మీద ఇరిగేషన్​శాఖ అయోమయానికి గురవుతున్నట్టు సమాచారం. అయితే, మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పునరుద్ధరణ డిజైన్ల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్​ఫర్​ ప్రపోజల్​ను పంపించింది. ఈ నెల 12నే నిర్మాణ సంస్థలకు డిజైన్ల బాధ్యతను అప్పగించాల్సి ఉన్నా.. సంస్థల విజ్ఞప్తితో గడువును 19 వరకు పొడిగించారు. అది కొనసాగుతుండగానే మేడిగడ్డ బ్యారేజీ వద్ద సీడబ్ల్యూపీఆర్ఎస్​నిపుణులు టెస్టులు చేస్తున్నారు.