రాష్ట్రంలో 5 ప్రైవేట్‌‌ వర్సిటీలకు పర్మిషన్

రాష్ట్రంలో 5 ప్రైవేట్‌‌  వర్సిటీలకు పర్మిషన్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదంతో బుధవారం ఆర్డినెన్స్‌‌ జారీ చేసింది. అనుమతి పొందిన వాటిల్లో మహీంద్రా, వోక్స్ సేన్, మల్లారెడ్డి, ఎస్ఆర్, అనురాగ్ వర్సిటీలున్నాయి. గతేడాది ప్రైవేట్ వర్సిటీల చట్టం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో 14  ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మంత్రులు కేటీఆర్‌‌, ఈటల, నిరంజన్‌‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌‌ కుమార్‌‌తో ఏర్పాటైన కేబినెట్‌‌ సబ్ కమిటీ 5 వర్సిటీలను ఆమోదించింది. వీటికే తుది అనుమతులిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్‌‌గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం బహదూర్ పల్లిలో మహీంద్రా వర్సిటీ, మెదక్ జిల్లా సదాశివపేటలోని కామ్​కోలేలోని వోక్స్ సేన్ క్యాంపస్‌‌లో వోక్స్ సేన్ యూనివర్సిటీ ఏర్పాటు కానున్నాయి. మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ, ఘట్కేసర్ మండలం వెంకటాపూర్‌‌లో అనురాగ్ వర్సిటీ, వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌‌పర్తి మండలం అనంతసాగర్‌‌లో ఎస్‌‌ఆర్ వర్సిటీ స్టార్ట్‌‌ కానున్నాయి.

3 వర్సిటీలు టీఆర్‌‌ఎస్ నేతలవే

అనుమతి పొందిన 5 వర్సిటీల్లో మహీంద్రా, వోక్స్ సేన్ వర్సిటీల మేనేజ్‌‌మెంట్లు ఇతర రాష్ట్రాలవి. మిగతా మూడు టీఆర్‌‌ఎస్ నేతలవే. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి వర్సిటీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌‌రెడ్డికి చెందిన అనురాగ్ వర్సిటీ, వరంగల్ టీఆర్ఎస్ నేత, ఎస్‌‌ఆర్ విద్యాసంస్థల అధినేత వరదారెడ్డికి చెందిన ఎస్‌‌ఆర్‌‌ వర్సిటీ ఇందులో ఉన్నాయి.

 

కరోనా కష్టంలో ఉంటే ఫీజుల పెంపు ఏంది?