
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యవజన సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశించిన యువతకు నిరాశే మిగిలింది. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లయినా ఇప్పటి వరకు యువత సంక్షేమం కోసం రాష్ట్ర సర్కార్ కు ఓ విధానమంటూ లేకుండా పోయింది. యూత్ పాలసీ కోసం 2016లో 11 శాఖల కమిషనర్లతో కమిటీ వేసిన ప్రభుత్వం.. ఆ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఇప్పటి వరకు ఆమోదముద్ర వేయలేదు. అలాగే యువజన సంక్షేమం కోసం ఉమ్మడి ఏపీలో అమలైన స్వయం ఉపాధి సబ్సిడీ లోన్లు, స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ లాంటి స్కీమ్ లు కూడా అమలు చేయకపోవడంపై యువజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యువజన సంక్షేమానికి అరకొర బడ్జెట్
యువత యాంటీ సోషల్ యాక్టివిటీస్ వైపు మళ్లకుండా సోషల్ సర్వీస్ పై ఆసక్తి కనబరిచేలా చైతన్యం కలిగించడం, క్రీడ, సాంస్కృతిక పోటీలు నిర్వహించడం, జాతీయ సమైక్యత శిబిరాలు పెట్టడం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యూత్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయడం, పోటీ పరీక్షల ప్రిపరేషన్ కు కావాల్సిన సౌలతులు కల్పిం చడం, స్వయం ఉపాధికి ప్రోత్సాహమివ్వడం వంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. కానీ రాష్ట్ర సర్కారు ఇవేమీ పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో యువజన సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్ లో అరకొరగా నిధులు కేటాయిస్తోంది. యువజన సర్వీసుల శాఖతోపాటు, బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులను రిలీజ్ చేయడం లేదు. యువజన సర్వీసుల శాఖకు ఏటా విడుదల చేస్తున్న నిధులు రూ.10 కోట్లు మించడం లేదు. అరకొర నిధులతో యువజనుల సంక్షేమం ఎలా చేపట్టాలి, ఏ రకమైన ఉపాధి శిక్షణ ఇవ్వాలి? అని ఆ శాఖాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో సీఎంఈవై, వెలుగు, ఉచిత కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లిష్ లో శిక్షణ వంటి కార్య క్రమాలు నిర్వహించారు. అంతేకాక లోన్లు ఇచ్చారు. ఆ స్కీంలు ఏవీ ఇప్పుడు అమలు కావడం లేదు. మరోవైపు యువత స్వయం ఉపాధికి ఉపయోగపడే బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా నాలుగేండ్లుగా మంజూరు చేయలేదు. 2018లో పెట్టుకున్న అప్లికేషన్లే 9.50 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. దళిత బంధు పేరుతో ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు కూడా నిలిపివేశారు. ఎస్టీ, మైనారిటీ శాఖల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
గ్రామాల్లో జాడ లేని యూత్ క్లబ్స్
ఒకప్పుడు గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవ, క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన యూత్ క్లబ్స్ ఇప్పుడు కనిపించడం లేదు. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక యూత్ క్లబ్స్ కు ప్రాధాన్యం ఇచ్చేవారని, ఇప్పుడు సర్కారు కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలుగా మారిపోయాయని యువజన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
నాలుగేండ్లుగా యూత్ ఫెస్టివల్స్ లేవు
రాష్ట్రంలో నాలుగేండ్లుగా ప్రభుత్వం యూత్ ఫెస్టివల్స్ నిర్వహించడం లేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది డిసెంబర్ లో అన్ని రా ష్టాల్లో డిస్ట్రిక్ట్, స్టేట్ లెవల్ లో యూత్ ఫెస్టివల్స్ నిర్వ హిస్తుంటారు. ఆ తర్వాత వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12న దేశంలోని ఏదైనా రాష్ట్రంలో నేషనల్ యూత్ ఫెస్టివల్స్ నిర్వహిస్తారు. ఈ వేడుకలకు క్లాసికల్, ఫౌక్ డ్యాన్స్ తదితర 18 రకాల ఈవెంట్లకు చెందిన వంద మంది యువజన కళాకారులను పంపాల్సి ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో చివరిసారిగా 2018లో రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్టివల్స్ నిర్వహించారు. 2019, 2020లో బడ్జెట్ లేదనే సాకుతో ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఆ రెండు సంవత్సరాల్లో నేషనల్ యూత్ ఫెస్టివల్స్ లో మన రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం లేకుండాపో యింది. 2021 జనవరిలో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా యూత్ ఫెస్టివల్స్ వాయిదాపడ్డాయి. ఈ ఏడాది జనవరిలో పాండిచ్చేరిలో జరిగిన ఫెస్టివల్స్ కు రాష్ట్రం నుంచి యువకళాకారులను పంపలేదు. వచ్చే ఏడాది జనవరిలో కర్నాటకలోని హుబ్బళ్లిలో నేషనల్ యూత్ ఫెస్టివల్స్ జరగబోతున్నాయి. దీని కోసం ఇప్పటి వరకూ రాష్ట్రం నుంచి యువ కళాకారుల ఎంపిక జరగలేదు.
ప్రభుత్వం యూత్ పాలసీ ప్రకటించాలి
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే పోరాడి తెలంగాణ సాధించుకున్నం. కానీ రాష్ట్రం వచ్చి ఎనిమిదేండ్లు దాటినా యూత్ పాలసీ ప్రకటించకపోవడం దురదృష్టకరం. యువ తకు వివిధ కార్పొరేషన్ల ద్వారా గతంలో ఇచ్చినట్లుగా స్వయం ఉపాధి సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలి. యువతకు స్ఫూర్తిగా స్వామి వివేకానంద జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.
అలువాల విష్ణు, నేషనల్ యూత్ అవార్డీ