
ఉప్పల్, వెలుగు : రోజురోజుకూ మహిళలు, యువతులపై దాడులు పెరిగిపోతుండటంతో వారికి వెంటనే న్యాయం అందించేందుకు ప్రత్యేక మహిళా ఠాణాల ఏర్పాటుకు పోలీసు శాఖ కసరత్తు మొదలుపెట్టింది. సిటీతో పాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మహిళా పీఎస్‌ల సంఖ్య అంతంత మాత్రమే ఉంది. వాటిని పెంచాలన్న ఉద్దేశ్యంతో కొత్తగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నాచారంలో 15 రోజుల కిందట కొత్తగా మహిళా పోలీసు స్టేషన్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.2 కోట్లతో ఈ స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే సుమారు 10 కి.మీ పరిధిలోని మహిళలు, యువతులకు సెక్యూరిటీతోప పాటు తొందరగా న్యాయం అందే అవకాశముంటుందని పోలీసులు చెప్తున్నారు.
సిటీలో 3.. రాచకొండలో ఒక్కటే ...
సిటీ కమిషనరేట్ పరిధిలో 3 మహిళా పోలీస్ స్టేషన్లు ఉండగా.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సరూర్ నగర్ లో మాత్రమే మహిళా పీఎస్ ఉండటంతో ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కేసుల పరిష్కారానికి నెలలు, ఒక్కోసారి ఏండ్ల తరబడి కూడా ఎదురు చూడాల్సి వస్తోందని బాధిత మహిళలు చెప్తున్నారు. దీంతో తాము లా అండ్ ఆర్డర్ పీఎస్‌లో ఫిర్యాదులు చేస్తున్నామంటున్నారు. కొన్ని పోలీసు స్టేషన్లలో వరకట్న వేదింపులు, గృహహింస లాంటి వంటి వాటిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. మహిళా పీఎస్‌కు వెళ్లాలని అక్కడి సిబ్బంది వెనక్కి పంపించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాచారంలో మహిళా పీఎస్ అందుబాటులోకి వస్తే రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళా పోలీసు స్టేషన్ల సంఖ్య రెండుకు చేరనుంది.
మల్కాజిగిరి ఏసీపీ ఆఫీసు సైతం అక్కడే..
నాచారం పీఎస్ వెనుక శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్లను కూల్చి అక్కడే మహిళా పీఎస్ బిల్డింగ్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఎస్హెచ్చాంబర్, యాంటీ క్లాక్ రూమ్, లాకప్, కమాండ్ కం ట్రోల్ నెట్‌వర్క్, ఇంటర్వ్యూ రూమ్, వైర్ లెస్ కమ్యూనికేషన్ రూమ్స్ లాంటి అధునాతన సౌకర్యాలతో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ. 2కోట్లతో బిల్డింగ్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు డీఐ చాంబర్, క్రైమ్ సిబ్బంది హాల్, క్రైమ్ క్యూబ్, ఇంటరాగేషన్ రూమ్, రెస్ట్ రూమ్స్, జిమ్ రూమ్‌లను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉప్పల్ పీఎస్‌లో కొనసాగుతున్న మల్కాజిగిరి ఏసీపీ ఆఫీసును సైతం నాచారంలో కొత్తగా కట్టే మహిళా పీఎస్ బిల్డింగ్‌ను తరలించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.