హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతే గోదావరి–- కావేరి లింక్ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. గోదావరిలో తమ రాష్ట్రానికి 967 టీఎంసీల నికర జలాల కేటాయింపులు ఉన్నాయని, ఆ మేరకు తాము నీటిని తీసుకోవాల్సి ఉందని తెలిపింది. మిగులు జలాల్లో 650 టీఎంసీలు కేటాయించాలని కోరింది. నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్ భూపాల్‌సింగ్ శుక్రవారం ఢిల్లీ నుంచి గోదావరి– కావేరి లింక్ ప్రాజెక్టుపై బేసిన్‌లోని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఈఎన్సీలు, ఇంజనీర్లు సమావేశంలో పాల్గొని అభిప్రాయాలు తెలిపారు.
తెలంగాణ వాటా పెంచాలె..
తెలంగాణకు గోదావరిలో ఉన్న కేటాయింపుల మేరకు ఇప్పటికే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, అత్యధిక క్యాచ్‌మెంట్ ఉన్న రాష్ట్రంగా ఎక్కువ నీటిని వాడుకునే హక్కు తమకు కల్పించాలని రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్, ఈఎన్సీ (అడ్మిన్) నాగేందర్‌రావు కోరారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తే ఎగువ రాష్ట్రాలకు హక్కులు వస్తాయని, అది ఇంటర్ స్టేట్ ఇష్యూ అవుతుందన్నారు. ఎగువ రాష్ట్రాల ఆమోదం లేకుంటే మున్ముందు న్యాయపరమైన చిక్కులు తప్పవన్నారు. ఇంద్రావతి నదిపై ఛత్తీస్‌గఢ్ బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మిస్తోందని, అవి పూర్తయితే గోదావరిలో మిగులు జలాలే ఉండవన్నారు. ఎన్‌డబ్ల్యూడీఏ అంచనా వేసినట్టుగా 75 డిపెండబులిటీగా లెక్కిస్తే గోదావరిలో మిగులు జలాలే లేవని తెలిపారు. ఈ అంశాలన్నీ పరిశీలించాకే లింక్ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఏపీ వాడకమే ఎక్కువ..
ఏపీ ఇంజనీర్లు స్పందిస్తూ.. తెలంగాణకు 967 టీఎంసీల కేటాయింపులు ఉన్నట్టుగా బచావత్ అవార్డులో ఎక్కడా లేదన్నారు. గోదావరిలో ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో తమ రాష్ట్రానికే వాడకం ఎక్కువగా ఉందన్నారు. తమ రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే లింక్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు. లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ, ఏపీ పాత వాదనలకే కట్టుబడి ఉండటంతో ఎన్‌డబ్ల్యూడీఏ మీటింగ్ మరోసారి ఏమీ తేలకుండానే ముగిసింది. మీటింగ్ లో తమిళనాడు ఈఎన్సీ మాట్లాడుతూ.. చెన్నైకి తాగునీటితో పాటు తమ రాష్ట్ర సాగునీటి అవసరాల దృష్ట్యా వీలైనంత త్వరగా కావేరి లింక్ ప్రాజెక్టు చేపట్టాలని కోరారు.
