రిటైర్ మెంట్ రోజే బెనిఫిట్స్ ఇస్తమని తిప్పుతున్న సర్కార్

రిటైర్ మెంట్ రోజే బెనిఫిట్స్ ఇస్తమని తిప్పుతున్న సర్కార్
  • 4 వేల అప్లికేషన్స్ పెండింగ్
  • ఇటు బెనిఫిట్స్ అందక..అటు పెన్షన్ రాక రిటైర్డ్​ ఉద్యోగుల అవస్థలు
  • నెలవారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి
  • రిటైర్ అయిన రోజే బెనిఫిట్స్​ ఇవ్వాలని2016లో సర్కార్ సర్క్యులర్
  • కానీ ఏ శాఖలోనూ అమలైతలె

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రిటైర్​మెంట్  బెనిఫిట్స్​ కోసం దాదాపు 4 వేల మంది ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో రిటైర్​ అయిన ఎంప్లాయీస్​కు  కూడా ఇప్పటికీ బెనిఫిట్స్  అందడంలేదు. ఫైల్స్ అన్నీ  ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.  ప్రతి నెలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకు కలుపుకొని దాదాపు  600 మంది రిటైర్​ అవుతుంటారు. వీరి హోదాను బట్టి  బెనిఫిట్స్ అందుతుంటాయి. సగటున ఒక్కొక్కరికి రూ. 50 లక్షల బెనిఫిట్స్  ఇవ్వాల్సి ఉంటుందని ఆఫీసర్లు అంటున్నారు. ఈ లెక్క ప్రతి నెల దాదాపు  రూ. 300 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. బెనిఫిట్స్​ను వెంటనే చెల్లించకుండా కొంతకాలం వాయిదా వేస్తే ప్రభుత్వానికి సర్దుబాటు జరుగుతుంది. 6 నెలల పాటు వాయిదా వేస్తే రిటైర్డ్​ ఉద్యోగులకు చెందిన రూ. 1,800 కోట్లు ఇతర అవసరాల కోసం ఖర్చు చేసుకోవచ్చు. అందుకనే రిటైర్డ్​ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నదనే చర్చ సెక్రటేరియట్  వర్గాల్లో  ఉంది.

ఫైనాన్స్​ నుంచి నో క్లియరెన్స్​

ఉద్యోగి రిటైరైన వెంటనే ఆ ఉద్యోగికి ఎంత మేరకు బెనిఫిట్స్ రావాలో సంబంధిత శాఖలు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు లెక్కలు పంపుతాయి. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే.. ఆ అమౌంట్ ను ట్రెజరీలు రిటైర్డ్ ఉద్యోగి అకౌంట్‌లోకి  జమ చేస్తాయి. లేకపోతే ఎన్ని నెలలైనా రిటైర్​మెంట్ బెనిఫిట్స్ అందవు. తమ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయని ట్రెజరీ ఆఫీసుల చుట్టూ రిటైర్డ్ ఎంప్లాయీస్ తిరగాల్సి వస్తోంది.  తమ వద్ద  ఫైల్ పెండింగ్​లో లేదని, ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​ నుంచి క్లియర్ కాలేదని ట్రెజరీ ఆఫీసర్లు సమాధానం ఇస్తున్నారు. పైనుంచి ఆదేశాలు రాకపోవడంతోనే ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం. ‘‘ప్రతి నెల ఎంత మంది రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలో ముందుగానే  ఫైనాన్స్ శాఖ ఓ నిర్ణయానికి వస్తుంది. ఆ లెక్కకు మించి అదనంగా ఒక్కరికీ ఇవ్వదు. మిగతా వారి ఫైల్ వచ్చే నెలలో క్లియర్  చేస్తుంటుంది’’ అని ఓ ఆఫీసరు చెప్పారు.

కాగితాలకే సర్క్యూలర్  పరిమితం

ఉద్యోగి రిటైర్​ అయిన రోజే అన్ని బెనిఫిట్స్​ చెల్లించాలని ఆదేశిస్తూ అన్ని శాఖలకు 2016 డిసెంబర్​ 24 న సర్కార్‌‌ సర్క్యూలర్ జారీ చేసింది. ఉద్యోగి రిటైర్​మెంట్​కు 6 నెలల ముందు నుంచే బెనిఫిట్స్​పై ఫైల్ రెడీ చేయాలని సర్క్యూలర్​లో ఉంది. ఉద్యోగి ఏ రోజైతే రిటైర్​ అవుతారో ఆ రోజు గౌరవంగా ప్రభుత్వ వెహికల్‌లో ఇంటి వద్ద దింపాలని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఇంతవరకు ఆ సర్య్కులర్ అమలవడం లేదు. ఈ నెల 14న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘పదవీ విరమణ రోజే అన్ని బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకుంటం. గౌరవంగా ఇంటికి ప్రభుత్వ వెహికల్‌లో పంపుతం. త్వరలో దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటం’’ అని చెప్పారు.

దగ్గరి వారికి ఎక్స్​టెన్షన్లు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, ఉద్యోగ సంఘాల నేతల బంధువుల్లో ఎవరైనా ఉద్యోగులు ఉంటే.. వాళ్లు రిటైర్​ అయినా సర్వీస్ ను పొడిగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వివిధ శాఖల్లో కలిపి ఇలాంటివారి దాదాపు 200 మంది దాకా ఉంటారు. ఈ లిస్టులో హెచ్​వోడీ స్థాయి నుంచి లెక్చరర్ వరకు ఉన్నారు. కొందరికైతే 2–3 సార్లు సర్వీస్ పొడిగించారు.

ఉద్యోగి రిటైర్​ అయిన రోజే అన్ని బెనిఫిట్స్​ చెల్లించి, గౌరవంగా ప్రభుత్వ వెహికల్​లో ఇంటి వద్ద దింపాలని 2016 డిసెంబర్​ 24 న రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అంతకు ముందు రోజు సీఎం కేసీఆర్​ రివ్యూ చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగి రిటైర్​మెంట్​కు 6 నెలల ముందు నుంచే బెనిఫిట్స్ పై  ఫైల్ రెడీ చేయాలని  ఆదేశించారు. కానీ ఏ శాఖలోనూ ఆ సర్క్యులర్ అమలవడం లేదు. రిటైర్​ అయి ఆరేడు నెలలు దాటినా చాలా మందికి బెనిఫిట్స్​ అందడం లేదు.

నెలవారీ ఖర్చుల కోసం అప్పులు

ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ క్లియర్ అయ్యాకనే రిటైర్డ్​ ఉద్యోగులకు పెన్షన్ మొదలవుతుంది. బెనిఫిట్స్​ అందక, పెన్షన్  రాక చాలా మంది నెలవారీ ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. కొందరైతే సొంత వెహికల్స్ అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఓ ఉద్యోగ సంఘం నేత తన రిటైర్​మెంట్​ బెనిఫిట్స్ కోసం పైరవీలు చేసినా ప్రయోజనం లేకుండా పోయినట్లు తెలిసింది. ఓ రిటైర్డ్ టీచర్ తనకు వచ్చే బెనిఫిట్స్‌‌తో కూతురు పెండ్లి చేయాలనుకున్నారు. బెనిఫిట్స్ ఆలస్యంతో పెండ్లిని వాయిదా వేశారు. బెనిఫిట్స్ అందకపోవడంతో కన్న కొడుకుల మీద ఆధారపడి బతకాల్సి వస్తోందని కొందరు  రిటైర్డ్​ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు 30ఏండ్లు సర్వీస్  చేసి, రిటైర్​ అయిన తర్వాత సంతోషంగా జీవితం గడపాలని ప్రతి ఎంప్లాయీ  ప్లాన్​ చేసుకుంటారు. కానీ ప్రభుత్వం నుంచి  రిటైర్​మెంట్  బెనిఫిట్స్ టైంకు రాకపోతే ఎట్ల సంతోషంగా ఉంటం?  ఇంటి ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి పరిస్థితి నెలకొంది.

–  4 నెలల కింద రిటైర్​ అయిన సెక్రటేరియట్ ఉద్యోగి ఆవేదన

బెనిఫిట్స్ ప్రభుత్వ సొమ్ము కాదు. ప్రతి నెల మా శాలరీ నుంచి కొంత కట్ చేసి జమ చేసిన పైసలు. మా డబ్బులు మాకు ఇచ్చేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావట్లే. రిటైర్డ్ ఉద్యోగులకు కావాల్సింది సత్కారాలో.. ప్రభుత్వ వెహికల్​లో సాగనంపడం కాదు. బెనిఫిట్స్ వెంటనే ఇస్తే అదే మాకిచ్చే గౌరవం.

– మార్చిలో రిటైరైన ఉద్యోగి సంఘం నేత ఆవేదన