రైతులకు రూ.300 కోట్ల ఇసుక బకాయిలు పెండింగ్

రైతులకు రూ.300 కోట్ల ఇసుక బకాయిలు పెండింగ్
  • ఏడాదిన్నరగా 5 వేల మంది ఎదురుచూపులు
  • ఇతర అవసరాలకు ఆ డబ్బుల్ని మళ్లించిన సర్కార్​
  • సర్దుబాటు అయ్యాక ఇస్తామంటూ తిరకాసు

హైదరాబాద్, వెలుగు: రైతులకు ఇవ్వాల్సిన ఇసుక డబ్బులను రాష్ట్ర సర్కార్ తన అవసరాలకు వాడుకుంది. ఏడాదిన్నరగా బిల్లుల కోసం వాళ్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో 5వేల మందికి పైగా రైతులు ఇబ్బందులు పడ్తున్నారు. బకాయిలు ఇప్పించమని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నా పనికావట్లేదు. వాళ్లు ఆఫీసర్లను అడిగితే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుందని, ఇప్పట్లో ఇవ్వడం కుదరదని చెప్పినట్టు తెలిసింది. దీంతో సొంత ప్రభుత్వాన్ని ఏమనలేక, రైతులకు ఏదో ఒకటి సర్దిచెప్పి పంపిస్తున్నారు. రాష్ట్రంలో రైతుల భూముల్లోని ఇసుకను ఆన్ లైన్ లో టీఎస్ఎండీసీ (తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్) అమ్ముతోంది. ఇట్ల అమ్మిన ఇసుక ఆదాయంలో 35 శాతాన్ని రీచ్ లపై హక్కులున్న రైతులు, సొసైటీలకు చెల్లించాలి. అక్రమాలు జరుగుతున్నాయనే కారణంతో సర్కార్ ఈ పాలసీ రూపొందించింది. దీంతో ఏటా ప్రభుత్వానికి ఇసుక అమ్మకాల వల్ల దాదాపు రూ.700 కోట్ల ఆదాయం వస్తోంది. ప్రతి రెండు నెలలకు ఓసారి ఇలా వచ్చిన ఆదాయంలో రైతుల వాటా చెల్లించేది. అయితే ఏడాదిన్నరగా దాదాపు రూ.300 కోట్ల బిల్లుల చెల్లింపు నిలిపేసిట్టు రైతులు చెప్తున్నారు.

బాధితుల్లో ఎక్కువ మంది గిరిజన రైతులే

నది తీరాల్లోని ఇసుక రీచ్ లు ఎక్కువగా ఐటీడీఏ పరిధిలో ఉన్నాయి. ఈ రీచ్ లోని ఇసుకను స్థానిక గిరిజనులు ఒక సొసైటీగా ఏర్పడి టీఎస్ఎండీసీ ద్వారా అమ్ముతుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 గిరిజన సొసైటీలలో 4 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. మిగతా ఇసుక రీచ్ లు ఇతర వర్గాలకు చెందిన రైతుల భూముల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 495 ఇసుక రీచ్ లు ఉన్నాయి. వీటిలో రెండు మూడు మాత్రమే లోకల్ బాడీల ఆధీనంలో ఉన్నాయి. ఏడాదిన్నరగా తమ వాటా డబ్బులు చెల్లించకపోవడంతో గిరిజన రైతులు ఇబ్బందులు పడ్తున్నారు.

బిల్లులపై మంత్రులు, ఎమ్మెల్యేల మౌనం

ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించాల్సిందిగా ఇసుక రైతులు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని వారివద్ద పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీంతో కొందరు మంత్రులు నేరుగా టీఎస్ఎండీసీ అధికారులకు ఫోన్ చేసి, ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని అడగ్గా... ‘‘చాలా కాలంగా బిల్లులను ఫైనాన్స్ శాఖ విడుదల చేయట్లేదు. మేం కూడా అడుగుతున్నాం.. కానీ బిల్లులు ఇవ్వట్లేదు. సీఎం ఇసుక బిల్లులను ఇవ్వొద్దని చెప్పడంతో ఫైనాన్స్ ఆఫీసర్లు ఆపేశారు. సర్దుబాటు అయ్యాక ఇస్తామని అంటున్నారు’’అని వారు అసలు విషయాన్ని వివరించినట్టు తెలిసింది. దీంతో మంత్రులు ఈ విషయంలో మౌనం వహిస్తున్నారు. గిరిజనుల హక్కుగా ఉన్న ఇసుకను ప్రభుత్వం అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటోంది. కానీ వారికి ఇవ్వాల్సిన వాటా డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వరని అడిగితే ప్రభుత్వం మరో అవసరానికి వాడుకుందని, కొంత టైమ్ తర్వాత ఇస్తామని చెప్తున్నారు.
- ఉత్తర తెలంగాణకు చెందిన  ఓ ఎస్టీ ఎమ్మెల్యే ఆవేదన