రాష్ట్రంలో నాలుగేండ్లలో 29% పెరిగిన ఖర్చు
జాతీయ స్థాయిలో 23 శాతమే పెరుగుదల
నేషనల్ హెల్త్ అకౌంట్స్ విడుదల చేసిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వైద్యం ఖర్చులు ఏటికేడు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు, ప్రభుత్వం కలిసి 2014–15 సంవత్సరంలో వైద్యం కోసం రూ.11,868 కోట్లు ఖర్చు చేయగా, 2018–19లో ఖర్చు ఏకంగా రూ.15,280 కోట్లకు పెరిగింది. ఈ లెక్కన నాలుగు ఏండ్లలోనే వైద్యం కోసం చేసిన ఖర్చు 28.74 శాతం పెరిగిపోయింది. ఇదే టైమ్ పీరియడ్‌లో దేశంలో వైద్యం ఖర్చు 23 శాతం మాత్రమే పెరిగింది. దేశంలో కంటే మన రాష్ట్రంలోనే వైద్యం ఖరీదు వేగంగా పెరుగుతున్నప్పటికీ, వైద్యం కోసం రాష్ట్ర సర్కార్ పెట్టే ఖర్చు మాత్రం ఆ స్థాయిలో పెరగడంలేదు. దీంతో మొత్తం ఖర్చులో సగ భాగం జనాలే మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో వైద్యం కోసం చేస్తున్న ఖర్చులో ప్రజలు 48 శాతం పెట్టుకుంటుండగా, ప్రభుత్వం 41 శాతం భరిస్తోంది. ఇంకో11 శాతం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, స్వచ్చంద సంస్థలు భరిస్తున్నాయి. ఈ మేరకు 2018-–19 సంవత్సరానికి సంబంధించిన నేషనల్ హెల్త్ అకౌంట్స్ రిపోర్టును కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసింది. 2018--–19లో తెలంగాణలో రూ.15,280 కోట్లను వైద్యం కోసం ఖర్చు చేయగా, ఇందులో రూ.7,332(40 శాతం) కోట్లు ప్రజలు తమ జేబు నుండి పెట్టుకున్నట్టు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మొత్తం 21 రాష్ట్రాల హెల్త్ అకౌంట్స్ వివరాలను రిపోర్ట్‌లో పొందుపరిచారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 71 శాతం ఖర్చును ప్రజలే భరిస్తుండగా, అత్యల్పంగా కర్నాటకలో 33.3 శాతం ఖర్చును మాత్రమే ప్రజలు పెట్టుకుంటున్నారు.
తలసరి వైద్య ఖర్చులో కేరళ టాప్
- వైద్యం కోసం రాష్ట్ర జీఎస్‌డీపీలో 0.7 శాతం మొత్తాన్ని రాష్ట్ర సర్కార్ ఖర్చు చేస్తోంది.
- అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జీఎస్‌డీపీలో 4.5 శాతాన్ని ప్రజల వైద్యం కోసం ఖర్చు చేస్తోంది.
- రాష్ట్రంలో తలసరి ఖర్చు రూ.4,130. ఇందులో రూ.1,687ను ప్రభుత్వం, రూ.1,982ను ప్రజలు భరిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తున్నయి.
- కేరళలో అత్యధికంగా తలసరి వైద్య ఖర్చు రూ.9,871గా ఉంది.
- బీహార్‌లో అత్యల్పంగా తలసరి వైద్య ఖర్చు రూ.1,517 మాత్రమే. ఇందులో రూ.674 మాత్రమే ప్రభుత్వం భరిస్తోంది.
