ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్లను గాలికి వదిలేసిన సర్కారు

ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్లను గాలికి వదిలేసిన సర్కారు
  • మూడ్రోజుల కింద నవీన్ మిట్టల్ బదిలీ 
  • అయినా ఎవ్వరికీ బాధ్యతలు అప్పగించని సర్కార్

హైదరాబాద్, వెలుగు: ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్లను సర్కారు గాలికి వదిలేసింది. ఇంటర్ బోర్డు సెక్రటరీతో పాటు కాలేజీ విద్యాశాఖ, టెక్నికల్ ఎడ్యుకేషన్​ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నవీన్ మిట్టల్ జవనరి 31న రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఆయన ఇంటర్ బోర్డు సెక్రటరీ, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తదితర పోస్టులను ఇన్​చార్జీ బాధ్యతలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఆ పోస్టుల్లో కొత్తగా ఎవ్వర్నీ నియమించలేదు. దీంతో అందరిలో అయోమయం నెలకొన్నది. ఇటు ఇంటర్ పరీక్షలతో పాటు అటు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసర్లతో కలిసి వివిధ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పైనా దృష్టి సారించాల్సి ఉంది. మూడ్రోజులైనా కొత్త వారిని నియమించకపోవడం, కనీసం ఇన్​చార్జీ బాధ్యతలనూ ఎవ్వరికీ అప్పగించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

బదిలీ అయినా ప్రమోషన్లు ఇచ్చిండు

సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ వివాదాస్పద ఉత్తర్వులిచ్చారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్​గా మంగళవారం రాత్రి బదిలీ అయిన తర్వాత... బుధవారం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీగా బాధ్యతలూ తీసుకున్నారు. ఆయన ఇటు ఇంటర్మీడియెట్, అటు కాలేజియెట్ ఎడ్యుకేషన్ లో వివిధ అంశాలపై ఉత్తర్వులు జారీచేశారు. రెండు డిగ్రీ కాలేజీల్లో అడ్ హక్ బేస్డ్ పై ఇద్దరు లెక్చరర్లకు ప్రిన్సిపల్స్​గా ప్రమోషన్లు ఇచ్చాడు. నల్గొండ డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ కమలను.. యాదాద్రి జిల్లా రామన్నపేట డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్​గా, ఖమ్మం జిల్లాలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంగ్లిష్​ లెక్చరర్ కేఎస్ఎస్​ రత్నప్రసాద్ కు.. సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గా ప్రమోషన్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులు మార్చి1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అయితే ఉత్తర్వులు ఫిబ్రవరి1న రిలీజ్ కాగా.. ఆర్డర్స్ అందిన 15 రోజుల్లోనే జాయిన్ కాకుంటే ఇవి రద్దవుతాయని దాంట్లో తెలపడం గమనార్హం. ఇంకోపక్క ఇంటర్ ఎడ్యుకేషన్​లో గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ బలరామ్ జాదవ్ ఓడీని రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం 2022 ఇయర్​కు మాత్రమే ఇచ్చిందనీ, ఆ గడువు ముగియడంతో నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఎఫ్ఏసీ బాధ్యతలు కూడా లేకుండా పలు ఉత్తర్వులివ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తవారికి చార్జ్ ఇచ్చే వరకూ ఆయనే కొనసాగుతారనీ ఆయన అనుకూలురు చెప్తుండగా, బదిలీ అయ్యాక ఆ శాఖ పనులు చేయడం రూల్స్​కు విరుద్ధమని మరికొందరు చెప్తున్నారు.