
- రెండేండ్లు కావొస్తున్నా ప్రారంభంకాని హబ్‌లు
- ఒక్క హైదరాబాద్‌లో ఏర్పాటు.. దానికీ 60% నిధులు కేంద్రానివే
- 16 జిల్లాల్లో బిల్డింగులు పూర్తి.. టెండర్ల దశలోనే పరికరాల కొనుగోలు
హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ డయాగ్నస్టిట్ హబ్‌లు ఏర్పాటు చేస్తాం”ఇదీ మునుపటి టర్మ్‌లో సీఎం కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీ. సర్కార్ దవాఖాన్లలో రోగులకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలన్న ఉద్దేశంతో ఈ హబ్‌లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఒక్క హైదరాబాద్ తప్ప మిగతా ఏ జిల్లాలోనూ హబ్‌ల ఊసే లేదు. ప్రభుత్వం టైంకు నిధులు ఇవ్వకపోవడం వల్లే హబ్‌ల పనులు ముందుకు కదలట్లేదని అధికారులు చెబుతున్నారు. 2018 జూన్‌లో హైదరాబాద్ హబ్‌ను ప్రారంభించారు. దానికీ నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వమే 60 శాతం నిధులిచ్చింది. ప్రస్తుతం అక్కడ రోజూ 4 వేల రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 16 జిల్లాల్లో హబ్‌ల ఏర్పాటుకు అవసరమైన నిధుల్లో 60 శాతం ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కానీ, రెండేళ్లవుతున్నా హబ్స్ఏర్పాటు కాలేదు. బిల్డింగులు కట్టి వదిలేశారంతే. డయాగ్నస్టిక్ పరికరాలు, యంత్రాల కొనుగోళ్లకు టెండర్లు పిలిచారు. అది పూర్తై హబ్‌లు ప్రారంభమవడానికి మరో ఐదారు నెలలు టైం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం టైంకు నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్లే హబ్‌ల ఏర్పాటు ఆలస్యమవుతోందని ఎన్హెచ్ఎం అధికారులు చెబుతున్నారు.
హబ్స్ ఏర్పాటు చేయాలనుకున్న జిల్లాలివీ
సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కొత్తగూడెం, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, గద్వాల, వికారాబాద్, నల్గొండ, జనగామ, ములుగు, ఖమ్మం, ఆసిఫాబాద్, జగిత్యాల.