
- రెండేండ్ల నుంచి డ్యూటీ చేస్తున్న ఓపీఎస్ లు
- తమను జేపీఎస్‌లుగా మార్చాలని వినతులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న 894 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీ(ఓపీఎస్)లను పంచాయతీ రాజ్ శాఖ త్వరలోనే తొలగించనుంది. ఇటీవల డిపార్ట్ మెంట్ వారీగా ఖాళీలను అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో పంచాయతీ రాజ్ శాఖ లో 1,455 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. వీటిలో 894 పంచాయతీ సెక్రటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 100, నల్గొండ లో 74, మేడ్చల్ లో 15 ఖాళీగా ఉన్నాయని అంటున్నరు. వాస్తవానికి 894 గ్రామాల్లో ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు పని చేస్తుండగా వారిని త్వరలోనే తొలగించనున్నారు. అందుకే ఆ పోస్టులను ఖాళీగా చూపించామని అధికారులు చెబుతున్నారు.
తొలగించేందుకు రంగం సిద్దం..
2018లో 9,355 జూనియర్ పంచాయతీ సెక్రటరీల(జేపీఎస్)లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. పని ఒత్తిడి, అధికారుల వేధింపులు, టార్గెట్లు, షోకాజ్ నోటీసులు, ఇతర జాబ్‌లు రావటం, ఇతర కారణాలతో చాలా మంది జాబ్‌లు మానేశారు. ఒక్క గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని సీఎం ఆదేశించటంతో రాతపరీక్షలో మెరిట్, రోస్టర్ సిస్టం ప్రకారం పంచాయతీ కార్యదర్శులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. ఖాళీలు పెరుగుతుండటంతో వీరిని జేపీఎస్ లుగా మార్చారు. ఇపుడున్న 894 మంది ఓపీఎస్ లను జేపీఎస్‌లుగా మార్చేందుకు అధికారులు అంగీకరించటం లేదు. దీంతో వీరిని తొలగించేందుకు రంగం సిద్దం చేశారు. ఇక జేపీఎస్‌లను ప్రభుత్వం వచ్చే ఏడాది గ్రేడ్ 4 సెక్రటరీలుగా రెగ్యులర్ చేయనుంది.
జీతం తక్కువ.. పని ఎక్కువ
జేపీఎస్ లకు గత అసెంబ్లీ సెషన్ లో జీతం పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు వారి జీతం రూ.15 వేల నుంచి రూ.28 వేలకు పెరిగింది. ఓపీఎస్ లకు రూ. 15 వేలు ఇస్తుండగా ఏజెన్సీలు తమ కమీషన్ ను కట్ చేసుకోని రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో రెండేండ్ల నుంచి తక్కువ జీతానికి పనిచేస్తున్న తమను జేపీఎస్ లుగా మార్చాలని కోరుతున్నారు. త్వరలో ఉద్యోగాలు పోతున్నయని సంకేతాలు రావటంతో 894 మంది ఓపీఎస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ ను కలిసి వారు వినతిపత్రం అందించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావును, ఇతర ఉన్నతాధికారులను కూడా కలిశారు.