హోటళ్లలో సర్వీస్ చార్జీలపై చర్యలు తీసుకోండి

హోటళ్లలో సర్వీస్ చార్జీలపై చర్యలు తీసుకోండి
  • కలెక్టర్లకు సీసీపీఏ ఆదేశాలు 
  • నేషనల్ కన్జూమర్ హెల్ప్ లైన్ కు 4  రోజుల్లో 85 ఫిర్యాదులు 

హైదరాబాద్, వెలుగు: హోటళ్లు, రెస్టారెంట్లు విధించే సర్వీస్ చార్జీలపై కేంద్రం విడుదల చేసిన గైడ్ లైన్స్ ను వెంటనే అమలు చేయాలని కలెక్టర్లను సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఆదేశించింది. గైడ్ లైన్స్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు శనివారం అన్ని రాష్ట్రాల సీఎస్ లకు లెటర్ రాసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్‌‌ చార్జీల వసూలుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నెల 4న సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) గైడ్ లైన్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. హోటల్, రెస్టారెంట్ కస్టమర్ కు వేసే బిల్లులో సర్వీస్‌‌ చార్జీని ఆటోమేటిక్‌‌గా చేర్చకూడదని, దాన్ని చెల్లించాలంటూ కస్టమర్ ను బలవంతం పెట్టొద్దని సీసీపీఏ ఈ గైడ్ లైన్స్ లో పేర్కొంది. గైడ్ లైన్స్ విడుదలైన నాలుగు రోజుల్లో ఎన్ సీహెచ్ హెల్ప్ లైన్ కు మొత్తం 85 ఫిర్యాదులు రాగా, అందులో ఢిల్లీ నుంచి వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. 

కంప్లయింట్​కు అనేక మార్గాలు.. 
కేంద్రం విధించిన రూల్స్​ను బ్రేక్ చేసి హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులు బిల్లులో సర్వీస్ చార్జీ వేస్తే కస్టమర్లు ఫిర్యాదు చేయడానికి అనేక మార్గాలున్నాయి. బాధితులు నేషనల్ కన్జూమర్ హెల్ప్ లైన్ (ఎన్సీహెచ్) – 1915కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఎన్ సీహెచ్ మొబైల్ యాప్ లో, లేదా జిల్లా వినియోగదారుల కమిషన్‌‌లో, జిల్లా కలెక్టర్ కు, www.edaakhil.nic.in  పోర్టల్ లోనూ ఫిర్యాదు చేయొచ్చు. అలాగే సీసీపీఏ మెయిల్ ఐడీ com-ccpa@nic.in కు కంప్లయింట్ మెయిల్ చేసే అవకాశం కల్పించింది. సంబంధిత ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత  కలెక్టర్ విచారణ జరిపి 15 రోజుల్లోగా నివేదికను అథారిటీకి సమర్పించాల్సి ఉంటుంది.