ఆర్నెళ్లు సామాజిక సేవ చేయాలి.. నల్గొండ కలెక్టర్ కు హైకోర్టు శిక్ష

ఆర్నెళ్లు సామాజిక సేవ చేయాలి.. నల్గొండ కలెక్టర్ కు హైకోర్టు శిక్ష

ప్రభుత్వ అధికారుల కోర్టు ధిక్కరణ చర్యలపై ఆగ్రహం వ్యక్తంచేసింది హైకోర్టు. అధికారులు కోర్టు ఆదేశాలకు తగిన గౌరవం ఇవ్వటంలేదని సీరియస్ అయింది. కోర్టు ధిక్కరణ శిక్షపడితే.. అప్పీల్ చేస్తే సరిపోతుందనే భావనలో ఉన్నారని కామెంట్ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులకే ఇద్దరు ముగ్గురు జడ్జీలను పెట్టాల్సివచ్చేలా ఉందని వ్యాఖ్యానించింది హైకోర్టు. ఆదేశాలను అధికారులు తేలిగ్గా తీసుకుంటే.. తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పింది ధర్మాసనం.  నల్గొండ కలెక్టర్, అప్పటి జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్.. కోర్టు ధిక్కరణ కేసుపైనా విచారణ జరిపింది హైకోర్టు. సామాజిక సేవ చేయాలని కలెక్టర్ ను న్యాయస్థానం ఆదేశించింది. వారానికి రెండు గంటలపాటు అనాథాశ్రమంలో గడపాలని తెలిపింది. ఆరునెలలపాటు సేవ చేయాలని కలెక్టర్ ను ఆదేశించింది కోర్టు. ఇక ఉగాధి, శ్రీరామనవమి రోజుల్లో అనాథాశ్రయాల్లో భోజనాలు పెట్టాలని.. సివిల్ సప్లయ్ ఆఫీసర్ సంధ్యారాణిని ఆదేశించింది కోర్టు.

 సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి కోర్టు ధిక్కరణ కేసును విచారణ జరిపింది కోర్టు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ పై ఇప్పటివరకు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుల వివరాలన్నీ.. తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆర్డీఓ, తహశీల్దార్ పై ఉన్న కోర్టు ధిక్కరణ వివరాలు సమర్పించాలని తెలిపింది. 

గతంలో కోర్టు ధిక్కరణ కేసులో... నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అప్పటి జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్ సంధ్యారాణిలకు కోర్టు 2వేల జరిమానా విధించింది. ఉత్తర్వులను కొట్టేయాలంటూ అప్పీల్ కు వెళ్లారు కలెక్టర్, CSO. ఇవాళ విచారణ జరిపిన కోర్టు.. ఇద్దరూ సామాజిక సేవ చేయాలని ఆదేశిస్తూ విచారణ ముగించింది.