హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రాసిక్యూషన్ డైరెక్టర్‌గా జి.వైజయంతి నియామకాన్ని సవాల్ చేసిన కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని వైజయంతితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ఆదేశించారు. సీఆర్పీసీ స్థానంలో కొత్తగా వచ్చిన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 25ఎ(2) ప్రకారం ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ పోస్టులో వైజయంతి కొనసాగే అర్హత లేదంటూ లాయర్ శ్రీనివాసులు మరొకరు హైకోర్టులో కోవారెంటో పిటిషన్ వేశారు.
వైజయంతి చట్ట విరుద్ధంగా పదవిలో కొనసాగుతున్నారన్నారని, బీఎన్ఎస్ఎస్లోని రూల్స్ ప్రకారం 10 ఏండ్లు తక్కువ కాకుండా లాయర్‌గా ప్రాక్టీస్ చేయాలని గుర్తుచేశారు. ప్రాసిక్యూషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ల నియామకానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ అనుమతి అవసరమని, కాబట్టి వైజయంతికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. అనంతరం ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా చేసింది.
