పోడు పట్టాలపై స్టేకు హైకోర్టు నో

పోడు పట్టాలపై స్టేకు హైకోర్టు నో

విచారణ జూన్ 22కు వాయిదా

హైదరాబాద్, వెలుగు : పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమలుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పోడు భూముల క్రమబద్ధీకరణలో చట్టం, నిబంధనలు పాటించాలని అటవీ శాఖను ఆదేశించింది. సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. పట్టాల పంపిణీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకునేందుకు ఆ ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరుతూ ఫోరమ్ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్ జీజీ) సెక్రటరీ పద్మనాభరెడ్డి వేసిన పిల్‌ను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది.

నిబంధలు పాటించకుండా పట్టాలివ్వడం చట్ట విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. అయితే, పట్టాల పంపిణీని అడ్డుకోవద్దని కోరుతూ తుడుందెబ్బ వరం గల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌ ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. ఆయన తరఫున అడ్వకేట్​ ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. షెడ్యూల్‌ తెగల వారికి పథ కాలు అందడం లేదన్నారు. రోజుకు ఒక్కసారైనా పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారని చెప్పారు. పట్టాలు పంపిణీతో వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. పోడు పట్టాలపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ, విచారణను జూన్‌ 22కు వాయిదా వేసింది.